కువైట్‌ అగ్నిప్రమాదంలో 42 మంది భారతీయుల మృతి

కువైట్‌ అగ్నిప్రమాదంలో 42 మంది భారతీయుల మృతి
* మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ని పంపిన మోదీ
 
కువైట్‌లో భారతీయ కార్మికులు నివాసముండే భవనంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 42 మంది మన దేశానికి చెందినవారే. వారిలో కేరళ, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌లకు చెందినవారున్నారు. చనిపోయిన వారిలో 21 మంది కేరళ వాసులే ఉన్నారని తెలిసింది. 
 
ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు సోషల్ మీడియాలో కూడా మృతి చెందిన వారి పట్ల సంతాపం తెలిపారు.
 
మరోవైపు కువైట్​లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి  కీర్తివర్ధన్ సింగ్ కువైట్​కు బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు హుటాహుటిన కువైట్​కు బయలుదేరినట్లు కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు.
 
 ‘అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు కువైట్​కు వెళ్తున్నా. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయ అధికారులు గాయపడిన వారిని పరామర్శించారు. ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి తెలియజేస్తా. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్​ఏ పరీక్షలు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక భారత్​కు మృతదేహాలు తీసుకువస్తాం’ అని కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు.
 
ప్రస్తుత పరిస్థితుల గురించి కువైట్ అధ్యక్షుడు అబ్దుల్లా అలీ అల్ యహ్యతో ఫోన్​లో మాట్లాడినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ‘కువైట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నా. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపే బాధ్యత నాదేనని కువైట్ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం సహాయం అందుతుందని చెప్పారు. మృతదేహాలను త్వరలోనే ఇండియాకు పంపించాలని కోరాను’ అని జైశంకర్ ఎక్స్​ వేదికగా తెలిపారు.

బుధవారం ఉదయం 4.30 గంటల సమయంలో భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతోపాటు పొగ దట్టంగా వ్యాపించడం వల్ల ఊపిరాడక ఎక్కువ మంది మరణించారు. అయితే 6 గంటల సమయంలో సమాచారం అందుకుని వచ్చిన ఐదు అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయని కువైట్‌ అధికారులు తెలిపారు. 

సహాయక చర్యల సందర్భంగా ఫైర్‌ ఫైటర్స్‌ కొందరు గాయపడ్డారు. కువైట్‌ హోంశాఖ మంత్రి షేక్‌ ఫహద్‌ అల్‌-యూసుఫ్‌ అల్‌-సబా ఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల సంఖ్యను ధ్రువీకరించారు. భవనం యజమానితోపాటు, ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.

అగ్ని ప్రమాదంపై దర్యాప్తునకు కువైట్‌ పాలకుడు షేక్‌ మెషాల్‌ ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. యువరాజు షేక్‌ సబా ఖాలెద్‌, ప్రధాని షేక్‌ అహ్మద్‌ మృతుల పట్ల సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

ఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు మున్సిపల్‌ అధికారులను సస్పెండు చేశారు. మరోవైపు భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయక నంబర్‌ను ఏర్పాటు చేసింది. బాధితుల కుటుంబ సభ్యులు +965 65505246 నంబరును సంప్రదించవచ్చు.