గవర్నర్ ఆలస్యం .. ముహూర్తంకు ప్రమాణం చేయలేని చంద్రబాబు

గవర్నర్ ఆలస్యం .. ముహూర్తంకు ప్రమాణం చేయలేని చంద్రబాబు
 
* ట్రాఫిక్ లో చిక్కులు పోయిన గవర్నర్
అధికారుల వైఫల్యం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం ముందుగా నిర్ణయించిన ముహుర్తానికి నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రమాణ స్వీకారానికి నిర్ణయించిన 11 గంటల 27 నిముషాల ముహూర్తానికి బహిరంగ వేదికపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయలేక పోయారు. గవర్నర్ రావడంలో జరిగిన ఆలస్యం, ట్రాఫిక్ చిక్కుల పై తీవ్ర అసంతృప్తి , ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ ప్రమాణ స్వీకార వేదికకు మూడు కిలోమీటర్ల దూరంలోని నిలిచిపోయారు. దాదాపు గంటకు పైగా గవర్నర్ కాన్వాయ్‌ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. వివిఐపిల ప్రయాణం కోసం ప్రత్యేకంగా స్టెరైల్ లైన్ ఏర్పాటు చేసినా దానిని నిర్వహించడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు.

విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద ఐపీఎస్ అధికారి విజయరావు నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను నియంత్రించడం, ముఖ్యమైన వాహనాలను అనుమతించడంలో ఆయన నిర్లక్ష్యం ప్రదర్శించారు. కేవలం రేడియో మెసేజీలపై ఆధారపడి ట్రాఫిక్‌ నియంత్రించారు. ఈ క్రమంలో అవసరం లేని వాహనాలను కూడా స్టెరైల్‌ లైన్‌లోకి వదిలేశారు. 

 
చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఉదయం 9.15కు రామవరప్పాడు రింగ్‌ క్రాస్ చేసింది. ఆ తర్వాత అమిత్‌ షా , ఇతర కేంద్ర మంత్రులు, పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్‌లు ప్రయాణించాయి. వాటితో పాటు భారీ సంఖ్యలో వాహనాలను వెళ్లినా వాటిని నియంత్రించకుండా వదిలేశారు. దీంతో గూడవల్లి వంతెన వద్దకు చేరే సరికి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. 
 
అప్పటికే మరో లేన్‌లో ప్రయాణించిన వారు వాహనాలను రోడ్లపై వదిలేసి కాలినడకన స్టెరైల్ మార్గంలో నడక ప్రారంభించారు. ఆ తర్వాత బయల్దేరిన గవర్నర్ కాన్వాయ్‌, కేంద్ర మంత్రులు వారి మధ్య చిక్కుకుపోయారు. దీంతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక ఆలస్యం కావడంతో ప్రధాని మోదీ సమక్షంలో వేదిక వెనుక ఏర్పాటు చేసిన గ్రీన్ రూములో 11. 27 గంటలకు చంద్రబాబు సంతకం చేశారు. గవర్నర్ రాక కోసం 15 నిముషాల పాటు ప్రధాని మోదీ, చంద్రబాబు వేచి ఉన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రుల తో ప్రమాణం చేయించాల్సిన గవర్నర్ వేదిక వద్దకు ఆలస్యంగా చేరుకోవడంపై ప్రధాని అరా తీశారు. అప్పటికి పలువురు కేంద్ర మంత్రులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. మరోవైపు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వైఫల్యం వల్లే ఈ ఆలస్యం జరిగినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సరైన సమయానికి ఎయిర్‌ పోర్ట్‌కు కూడా గవర్నర్ చేరుకోలేకపోయారు.

ట్రాఫిక్‌లో చిక్కుకుని అటు విమానాశ్రయానికి, ఇటు వేదిక వద్దకు సకాలంలో చేరలేకపోయారు. గవర్నర్ కాన్వాయ్‌కు ట్రయల్ రన్ కూడా పోలీస్ యంత్రాంగం నిర్వహించలేదు. విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణను ఉదయం నుంచి ట్రాఫిక్ నియంత్రణ ను పోలీసులు గాలికి వదిలేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్త రెండు కిలోమీటర్లు కాలినడక నడవాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై ప్రాథమికంగా విచారణ జరిపిన అధికారులు బాధ్యుల్ని గుర్తించే పనిలో పడ్డారు.