
కొద్ది నెలలుగా లోక్ సభ ఎన్నికలలో మునిగిపోయిన బిజెపి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కూడా పూర్తికావడంతో ఇక సంస్థాగత ఎన్నికలపై దృష్టి సారింపనుంది. లోక్ సభ ఎన్నికలలో కొన్ని రాస్త్రాలలో ప్రతికూల ఫలితాలు రావడం, కొన్ని రాష్ట్రాలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాలలో చేరడంతో ఆయా రాష్ట్రాలలో కొత్తవారిని నియమించాల్సి ఉంది.
పైగా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పదవీకాలం గత ఏడాదే పూర్తి కావడంతో ఆయన పదవిని ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ లోగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరారు. నూతనంగా అధ్యక్ష పదవి చేపడతారని భావించిన శివరాజ్ సింగ్ చౌహన్, ధర్మేంద్ర ప్రధాన, మోహన్ లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్ వంటి వారు కేంద్ర మంత్రివర్గంలో చేరారు. దానితో వెంటనే కొత్త అధ్యక్షుడిని నియమించడమా? లేదా ఆయన పదవీకాలం కొద్దినెలల పొడిగించి కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించడమా? నిర్ణయించాల్సి ఉంది.
పార్టీ జాతీయ కార్యవర్గంలో సహితం పలువురు ప్రభుత్వాలలో చేరారు. ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలకు ఇన్ ఛార్జ్ లను నియమించాల్సి ఉంది. పలువురు కొత్తగా ఎంపీలుగా, ఎమ్యెల్యేలుగా ఎన్నికయ్యారు. పలువురు కేంద్ర మంత్రులకు అవకాశం లభించలేదు. దానితో పలువురు మాజీ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది.
ఎన్నికల ప్రచారంపై దృష్టంతా నిమగ్నం చేయడంతో సంస్థాగత ఎన్నికలను, మార్పులను తాత్కాలికంగా పార్టీ పక్కన పెట్టినట్లు వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మోదీ 3.0 కూడా కొలువుదీరిన నేపథ్యంలో వెంటనే సంస్థాగత వ్యవహారాలపై పార్టీ అగ్ర నాయకత్వం దృష్టి సారించనున్నట్లు వారు చెప్పారు. లోక్సభలో బిజెపి మెజారిటీని కోల్పోయినప్పటికీ ఎన్డిఎ మిత్రపక్షాలతో కలసి 272 మెజారిటీ మార్కును సులభంగానే దాటేసింది. రాబోవు 10 నెలల్లో ఆరు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంది. అందుకోసమేనా పార్టీని సంస్థాగతంగా సంసిద్ధం చేయాల్సి ఉంది.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి