పక్షం రోజుల్లో 30-50 శాతం పెరిగిన ఉల్లి ధరలు

గత పక్షం రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉల్లి ధరలు 30 నుండి 50 శాతం వరకూ పెరిగాయి. సరఫరాలు తగ్గిపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. మరోవైపు బక్రీద్‌ పండుగు సమీపిస్తుండడంతో ఉల్లికి డిమాండ్‌ పెరిగింది. డిమాండ్‌, సరఫరాల మధ్య వ్యత్యాసం కారణంగా ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. 
 
ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్న ఉద్దేశంతో కొందరు వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. నాసిక్‌లోని లాసాల్‌గాన్‌ మండిలో గత నెల 25న కిలో ఉల్లిగడ్డ ధర రూ.17 పలకగా సోమవారం అది రూ.26కు చేరింది. నాణ్యమైన ఉల్లి కావాలంటే రూ.30 చెల్లించాల్సి వస్తుంది. 
 
ఉల్లిగడ్డలు జూన్‌ నెల నుండి మార్కెట్‌కు వస్తుంటాయి. అప్పటి వరకూ రైతులు, వ్యాపారులు వాటిని తమ వద్దే నిల్వ చేస్తారు. తమ వద్ద ఉన్న నిల్వలను విక్రయించేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. రబీ సీజన్‌లో ఉల్లి దిగుబడులు తగ్గిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని వారు ఆశిస్తున్నారు.
 
ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో శ్రీలంక, బంగ్లాదేశ్‌, మలేసియా తదితర దేశాలకు ఉల్లి ఎగుమతులు తిరిగి ప్రారంభమయ్యాయి. గత నెలలో ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన తర్వాత నాసిక్‌ జిల్లా నుండి ప్రతి రోజూ సగటున మూడు వేల టన్నుల ఉల్లిగడ్డలతో కంటైనర్లు తరలిపోతున్నాయని ఓ వ్యాపారి తెలిపారు. దీనివల్ల దేశంలో ఉల్లికి డిమాండ్‌ పెరిగిందని ఆయన చెప్పారు.
 
ఈ నెల 17న ముస్లింలు బక్రీద్‌ పండుగ జరుపుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా డిమాండ్‌ పెరగవచ్చునని వ్యాపారులు అంచనా వేశారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పండే ఉల్లికి దక్షిణాది రాష్ట్రాల నుండి తీవ్రమైన డిమాండ్‌ ఉంటోంది. 
 
కేంద్రం ఎగుమతి సుంకాన్ని తొలగిస్తుందని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు. దేశీయంగా ధరలు పెరగడానికి ఇది ఓ కారణం. ధరలు పెరిగే వరకూ వారు తమ వద్ద ఉన్న నిల్వలను మార్కెట్‌కు పంపబోరని, అందుకే కృత్రిమ కొరత ఏర్పడి ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయని చెబుతున్నారు.