
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మోదీ 3.0 కేబినెట్లో 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం దక్కింది. వీరంతా తమ బాధ్యతలను కూడా స్వీకరించారు. ఈ క్రమంలో లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. దీంతో ఇప్పుడు స్పీకర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. జూన్ 24వ తేదీ నుంచి జులై 3 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజుజు బుధవారం ప్రకటించారు. 18వ లోక్‌సభ మొదటి సెషన్‌ను జూన్ 24 నుంచి జులై 3వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఇక రాజ్యసభ జూన్ 27వ తేదీ నుంచి మొదలై జులై 3 వరకూ కొనసాగనున్నట్లు ప్రకటించారు. జూన్ 27 ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో ప్రభుత్వం చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వెల్లడించనున్నట్లు తెలిసింది.
రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంట్‌కు పరిచయం చేయనున్నట్లు కిరెణ్ రిజుజు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ఈ చర్చలో వివిధ అంశాలపై ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ లోక్‌సభ స్పీకర్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. సభాపతి పదవి తమకు ఇవ్వాలని అధికార బీజేపీ మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూ పట్టుబడుతున్నాయి. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, టీడీపీ ఎంపీ హరీశ్ మాథుర్ స్పీకర్ రేసులో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.
అయితే, ఇదే సమయంలో రాజస్థాన్ కోటా నుంచి లోక్‌సభకు ఎన్నికైన ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. దీంతో స్పీకర్ పదవి ఎవరికి దక్కొచ్చనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం