సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు

సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు
సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు వస్తుందని, అందుకోసం, ముందుగా ఆధ్యాత్మిక మేల్కొలుపు అవసరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆక్రమణదారులు భారతదేశంపై దాడి చేసినప్పుడు, వారి దౌర్జన్యాలతో సమాజం కలవరపడిందని, అప్పుడు సాధువులు ఆధ్యాత్మిక జాగృతితో సమాజాన్ని మేల్కొల్పుతూ ప్రజలలో నిర్భయ భావనను రేకెత్తించారని ఆయన గుర్తు చేశారు.
 
మనం కూడా మన ప్రవర్తనలో సాన్నిహిత్యం, ఐక్యతను అలవర్చుకోవాలని,  అప్పుడే సమాజంలో సామరస్యం సాధ్యమవుతుందని తెలిపారు. నాగపూర్ లో కార్యకర్తల అభివృద్ధి -11 శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీక్షేత్ర గోదావరి ధామ్‌ ప్రధాన అర్చకుడు మహంత్‌ శ్రీ రామగిరి మహారాజ్‌, ఆ తరగతి సర్వాధికారి ఇక్బాల్‌ సింగ్‌, విదర్భ ప్రాంత్‌ సంఘచాలక్‌ దీపక్‌ తాంశెట్టివార్‌, నాగ్‌పూర్‌ మహానగర్‌ సంఘచాలక్‌ రాజేష్‌ లోయా తదితరులు పాల్గొన్నారు.
 
 డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైనా పెద్ద మార్పు రాకముందే సమాజంలో ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుందని చెప్పేవారని డా. భగవత్ గుర్తు చేశారు. మన సమాజం వైవిధ్యంతో నిండి ఉందని, కానీ అన్నింటికీ మూలం ఒకటే అని స్పష్టం చేశారు. మనం ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలని, మన స్వంత ఆరాధనను విశ్వాసిస్తూనే ఇతరుల పూజా విధానాన్ని కూడా గౌరవించాలని సూచించారు.
 
ఎప్పుడైతే ఈ విషయాన్ని మరచిపోయామో అప్పుడు సమాజంలో ఒక వక్రీకరణ జరిగిందని, మనం మన స్వంత సోదరులు, సోదరీమణులను అంటరానివారిగా పరిగణించి వారిని విడిగా ఉంచామని చెప్పారు. దీనికి వేదాలు, ఉపనిషత్తుల నుండి ఎటువంటి మద్దతు లేదని తేల్చి చెప్పారు. అంటరానితనం అనే వివక్ష పాతబడిపోయిందని పేర్కొంటూ ఇప్పుడు సమాజానికి ఐక్యత అవసరం అని డా. భగవత్ పిలుపిచ్చారు.
 
సమాజంలో జరిగే అన్యాయం వల్ల ఒకరిపై ఒకరు ద్వేషం, అపనమ్మకం పుడతాయని అంటూ మన సమాజంలోనే అన్యాయం జరిగి మన నుంచి విడిపోయిన వారిని మన వెంట తీసుకురావాలని ఆయనచెప్పారు. అందరి పట్ల సద్భావన అవసరం అని తెలిపారు.
 
పర్యావరణంపై భారతీయ దృక్పథం
 
గతంలో కంటే ఈ ఏడాది వేడి ఎక్కువగా ఉందని సర్‌సంఘచాలక్‌ తెలిపారు. పర్వత ప్రాంతాలలో కూడా వేడిగాలులు వీచాయని, బెంగుళూరు లాంటి మహానగరంలో నీటి ఎద్దడి నెలకొందని, హిమానీనదాలు కరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సంక్షోభం పెరుగుతోందని చెబుతూ భారతీయ సంప్రదాయం పర్యావరణానికి స్నేహితునిగా పరిగణించబడుతుందని తెలిపారు.
 
మన ప్రాథమిక దృష్టి వసుధైవ కుటుంబకం అని, విశ్వం మన తల్లి అని అంటూ  ఈ భావనతో, పర్యావరణ పరిరక్షణ, ప్రోత్సాహానికి నమూనాలను సృష్టించాలని డా. భగవత్ పిలుపిచ్చారు. సామాజిక సామరస్యం, పర్యావరణం, స్వీయ-ఆధారిత వ్యవస్థ, కుటుంబ జ్ఞానోదయం, పౌర కర్తవ్యం – ఈ ఐదు మార్పులపై సంఘ్ పని ప్రారంభించిందని ఆయన తెలిపారు.
 
అభివృద్ధి పథంలో భారతీయ దృక్పథం ఆధునిక శాస్త్రాన్ని, ప్రాచీన విజ్ఞానాన్ని ఒక చోట చేర్చి కృషి చేయాలని ఆయన చెప్పారు. దీని కోసం, అభివృద్ధి ప్రమాణాలను భారతీయ దృక్పథం నుండి రూపొందించాలని సూచించారు. ఇందుకు దేశంలో శాంతి నెలకొనాలని చెబుతూ ఏ దేశమూ అశాంతితో పనిచేయదని డా. భగవత్ స్పష్టం చేశారు.
 
 సంఘ్ పరివార్ నుండే సామాజిక సామరస్య సాక్షాత్కారం
 
భారతదేశం యుద్ధ భూమి కాదని, బుద్ధుడిదని శ్రీరామగిరి మహారాజ్ చెప్పారు. కొన్నేళ్లుగా భారతదేశపు మతం, సంస్కృతిలపై దాడి జరుగుతున్నా  భారతదేశపు సాధు సంప్రదాయం, సద్గురువులు దానిని రక్షించడంలో గొప్ప పని చేసారని ఆయన చెప్పారు. సంఘ్ పరివార్ సంస్కృతి, అంకితభావం, సామాజిక సామరస్యాన్ని బోధిస్తుందని తెలిపారు. తండ్రి మాటను పాటించిన శ్రీరాముడు మనకు ఆదర్శం అంటూ  వివిధ సందర్భాల ద్వారా భారతీయ సంస్కృతి భావనను వివరించారు. సామాజిక జీవితంలో సామాజిక సామరస్య భావాన్ని వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.