
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. అనంతరం మంత్రులుగా పవన్‌కల్యాణ్, నారా లోకేష్ ప్రమాణస్వీకారం చేశారు.
కేసరపల్లిలో సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం జాతీయ గీతాలాపనతో వైభవంగా ప్రారంభమైంది. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయడు గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా వేదికపైకి చేరుకున్నారు. పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
వీరిలో పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్‌ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బి.సి.జనార్దన్‌రెడ్డి, టి.జి.భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రధాని మోదీని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న అందరినీ పేరుపేరునా ప్రధాని మోదీ పలకరించారు. ప్రధాని, గవర్నర్‌తో కలిసి నూతన మంత్రివర్గం గ్రూప్ ఫొటో తీయించుకున్నారు. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ జ్ఞాపిక అందించారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవి, పవన్‌తో కలిసి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు.
ఏపీలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యానని పేర్కొన్నారు. సీఎంతో పాటు ప్రమాణం చేసిన మంత్రులందరికీ అభినందనలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, ప్రముఖ నటులు చిరంజీవి, రజినీకాంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఎల్జేపీ చీఫ్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, మాజీ గవర్నర్ తమిళిసై, తదితరులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. వీరందరితో సభా ప్రాంగణం జనసంద్రంగా మారిపోయింది.
కాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు.. నవ్యాంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. 1978లో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. 1999లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి 2024 వరకు నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దక్కింది. పవన్‌తోపాటు మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు తొలిసారి ఎమ్మేల్యేలుగా గెలిచారు.
పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డి తదితరులు గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ మంత్రివర్గంలో ఎప్పుడూ చోటు దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు తొలిసారిగా వీరికి ఆ అవకాశం లభించింది. మొత్తంగా 17 మంది కొత్తవాళ్లు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. జనసేనకు మూడు, బీజేపీకి ఒక స్థానం కల్పించారు. మరో స్థానాన్ని ఖాళీగా ఉంచారు.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్