ఏపీలో రూ 50 వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ అవకాశం!

ఏపీలో రూ 50 వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ భారీ పెట్టుబడులకు రాష్ట్రం గమ్యస్థానం కాబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఐదేళ్లల్లో కొత్త పెట్టుబడులు రాకపోగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే ఇతర ప్రాంతాలకు తరలివెళ్లి పోయాయి. ప్రభుత్వం మార్పుతో,  పైగా కొత్త కూటమి పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలు ప్రకటించడంతో పెట్టుబడిదారుల దృష్టిని రాష్ట్రం ఆకట్టుకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తారనే ఉద్దేశంతో ఏపీవాసులు టీడీపీ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించారు. సంక్షేమ పథకాలతో ప్రజలను నగదు బదిలీ ద్వారా లబ్ధి చేకూర్చిన వైసీపీని కూడా కాదని, సంక్షేమం ప్లస్ అభివృద్ధి నినాదంతో ఎన్నికలకు వచ్చిన టీడీపీ కూటమికి ఏపీ ఓటర్లు పట్టం కట్టారు.

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఏడాదికి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 

అయితే ఈ రిఫైనరీ నెలకొల్పేందుకు మూడు రాష్ట్రాలను బీపీసీఎల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఒకచోట ఈ రిఫైనరీని ప్రారంభించాలని బీపీసీఎల్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

“పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశానికి మరిన్ని రిఫైనరీలు అవసరం ఉంది. అందులో భాగంగా బీపీసీఎల్ తూర్పు తీరంలో లేదా పశ్చిమ తీరంలో మరొక రిఫైనరీని ప్లాన్ చేస్తోంది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి” అని ఒక అధికారి చెప్పినట్లు ఎకనమిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. 

కొత్త రిఫైనరీ కోసం ఏపీ, యూపీ, గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్లు సమచారం.  మరోవైపు బీపీసీఎల్ ఛైర్మన్ కృష్ణ కుమార్ సైతం ఇటీవల ఇదే విషయంపై మాట్లాడారు. 2029 నాటికి బీపీసీఎల్ తన సామర్థ్యాన్ని 45 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బీపీసీఎల్‌కు ముంబై, కోచి, మధ్యప్రదేశ్‌లోని బినాలో రిఫైనరీలు ఉన్నాయి. కొత్త రిఫైనరీ ఏర్పాటు కోసం తూర్పు తీర ప్రాంతం, పశ్చిమ తీరప్రాంతాలను బీపీసీఎల్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఆలోచనలు సైతం చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఎకనమిక్స్ టైమ్స్ ప్రచురించిన ఈ కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తను షేర్ చేస్తున్న టీడీపీ కూటమి శ్రేణులు ఏపీకి స్వర్ణయుగం మొదలుకాబోతోందంటూ పోస్టులు పెడుతున్నారు. రూ. 50 వేలకోట్ల పెట్టుబడి ఒకేసారి వస్ స్థానికులకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని, వేల మందికి పరోక్షంగా లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ భారీ ప్రాజెక్టును ఏ మేరకు ఏపీకి తీసుకువస్తారనేదీ చూడాలి మరి.