మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం

కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్‌ కొలువుదీరింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ వరసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం7 గంటల 15 నిమిషాలకు మూడోసారి ప్రధానిగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. తద్వారా దేశ తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ సమం చేశారు.  
 
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ, విదేశాల నుంచి 8 వేల మంది అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీతో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్‌ హోదా, ఐదుగురు సహాయ (స్వతంత్ర), 36 మంది సహాయ మంత్రులుగా ఉండనున్నారు.

3.0లో బీజేపీ నుంచి 61 మందికి, మిత్రపక్షాల నుంచి 11 మందికి మోదీ కేబినెట్‌లో అవకాశం దక్కింది. మిత్ర పక్షాల్లో టీడీపీకి రెండు, జేడీయూకి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఎల్‌జేపీ, జేడీఎస్‌, ఆర్‌పీఐ, ఆర్‌ఎల్డీ, ఏడీఎస్‌, హెచ్‌ఏఎం నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు దక్కాయి. 

కాగా, కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో 43 మందికి మూడు సార్లు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అనుభవం ఉంది. ఇక 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మోదీ కేబినెట్‌లో 27 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు, ఐదుగురు మైనార్టీలు ఉన్నారు.

రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కుమారస్వామి ( జేడీఎస్‌), పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, జితన్‌రాం మాంఝీ (హిందుస్థానా అవామ్‌ మోర్చా), లలన్‌ సింగ్‌ (జేడీయూ), సర్బానంద సోనోవాల్‌, వీరేంద్రకుమార్‌, కింజారపు రామ్మోహన్‌ నాయుడు (టీడీపీ) కాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

అట్లాగే, ప్రహ్లాద్‌ జోషి, జుయల్‌ ఓరం, గిరిరాజ్‌ సింగ్‌, అశ్వనీ వైష్ణవ్‌, జ్యోతిరాదిత్య సింథియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్‌, అన్నపూర్ణాదేవి (జార్ఖండ్‌), కిరణ్‌ రిజిజు, హర్దీప్‌ సింగ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, కిషన్‌ రెడ్డి, చిరాగ్‌ పాసవాన్‌ (ఎల్జేపీ ), సీఆర్‌ పాటిల్‌ కూడా కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రావ్‌ ఇంద్రజీత్‌సింగ్‌, జితేంద్ర సింగ్, అర్జున్‌ మేఘవాల్‌, ప్రతాప్‌ రావ్‌ గణపత్‌ రావు జాదవ్‌, జయంత్‌ చౌదరి కేంద్ర సహాయ ( స్వతంత్ర) మంత్రులుగా ప్రమాణం చేశారు.

జితిన్‌ ప్రసాద్‌, శ్రీపాద్‌ యశో నాయక్‌, పంకజ్‌ చౌదరి, క్రిషన్‌ పాల్‌, రాందాస్‌ అఠవలే, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, నిత్యానంద్ రాయ్‌, అనుప్రియ పటేల్‌, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎస్పీ సింగ్‌ బఘేల్‌, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్‌ సింగ్‌, బీఎల్‌ వర్మ, శాంతను ఠాకూర్‌, ఎల్‌ మురుగన్‌, అజయ్‌ తంప్టా, బండి సంజయ్‌ సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

వారితో పాటు కమలేశ్‌ పాసవాన్‌, భగీరథ్‌ చౌదరి, సతీశ్‌ చంద్ర దూబె, సంజయ్‌ సేథ్‌, రవనీత్‌ సింగ్‌, దుర్గాదాస్‌ ఉయికె, రక్షా నిఖిల్‌ ఖడ్సే, సుఖాంత్‌ మజుందర్‌, సావిత్రి ఠాకూర్‌, తోకన్‌ సాహు, రాజ్‌ భూషణ్‌ చౌదరి, భూపతి రాజు శ్రీనివాస వర్మ, హర్ష మల్హోత్రా, నిముబెన్‌ బంభానియా, మురళీధర్‌ మొహోల్‌, జార్జ్‌ కురియన్‌, పవిత్ర మార్గెరెటా కూడా కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

సామాజిక సమీకరణాల పరంగా చూస్తే కేంద్ర మంత్రి మండలిలో మొత్తం 27 మంది ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వారికి స్థానం కల్పించారు. 10 మంది ఎస్సీలు, 5 మంది ఎస్టీలు, 5 మంది మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. ఇక రికార్డు స్థాయిలో 18 మంది సీనియర్ మంత్రులు ప్రధాన మంత్రిత్వ శాఖలను నిర్వర్తించనున్నారు.

యూపీ నుంచి 9 మందికి కేంద్ర మంత్రి పదవులు దక్కగా, మహారాష్ట్ర నుంచి ఆరుగురుకి కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఇక గుజరాత్‌ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ఐదుగురు, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ లనుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లకు నాలుగు చొప్పున మంత్రి పదవులు, జార్ఖండ్‌ ,బెంగాల్‌, తెలంగాణాల నుంచి ఇద్దరికి చొప్పున మంత్రి పదవులు, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, జమ్మూ కాశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లకు ఒక్కో మంత్రి పదవి దక్కింది.