చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లిలో జరుపనున్న  ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం 17 ఎకరాల విస్తీర్ణంలో సీనియర్‌ అధికారులు, టీడీపీ నేతల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు ఆదివారం పరిశీలించారు. 60 మంది కూర్చునే విధంగా 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడువు, 8 అడుగల ఎత్తులో స్టేజీని నిర్మిస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలు, ప్రజల కోసం 800 అడుగుల పొడవు, 420 అడుగుల వెడల్పు ఉన్న జర్మన్‌ హ్యాంగర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని సీఎస్  వెల్లడించారు. ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. విస్తృత మైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 
 
గన్నవరం విమానాశ్రయంలో వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్కు ఏర్పాట్లు చేయాలని ఎయిర్ అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద, రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఇతరుల వాహనాల పార్కింగ్కు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 
 
ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్త తెలిపారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.