మోదీ మంత్రివర్గంలో ఇద్దరు టిడిపి ఎంపీలు

కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 
 
16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
 
కేంద్ర మాజీమంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు (36) వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్సార్సీపీ గాలి వీచినా తట్టుకుని నిలబడి, ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా, ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్‌నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించిందే. 
 
తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంట్‌ చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేశారు.  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యలు నిర్వహిస్తున్నారు. రామ్మోహన్‌నాయుడి చిన్నాన్న అచ్చెన్నాయుడు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు.  సోదరి ఆదిరెడ్డి భవాని మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామ్మోహన్‌ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
 
ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్‌ (47) గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.  అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘యు వరల్డ్‌’ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను ప్రారంభించి, స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తూ అతికొద్దికాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది