తెలంగాణాలో సీట్లు తగ్గడంపై సోనియా, ఖర్గే అసహనం!

కేవలం ఆరు నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పుకోదగిన సీట్లు గెలవలేక పోవడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అసహనం వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. పైగా, కాంగ్రెస్ తో సమానంగా బిజెపి ఎంపీ సీట్లు గెల్చుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారని చెబుతున్నారు.
 
ఢిల్లీలో శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్లమెంటరీ కమిటీ సమావేశాల సందర్భంగా ఈ విషయమై ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్  రెడ్డిని నిలదీసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం పట్ల ఖర్గే తన ప్రసంగంలో విస్మయం వ్యక్తం చేశారు. ఈ మూడు రాష్ట్రంలో పరిస్థితులపై విడివిడిగా సమీక్ష జరుపుతానని ప్రకటించారు.
 
తెలంగాణలోని 17 సీట్లలో కాంగ్రెస్, బీజేపీ తలో 8 సీట్లు గెల్చుకోగా, ఏఐఎంఐఎం ఒక సీటు గెల్చుకుంది. ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెల్చుకోలేక పోయింది. పైగా, రెండు సీట్లలో మినహా మూడో స్థానంలోకి పడిపోయింది. ఈ విధంగా తెలంగాణాలో బిజెపి బలంపుంజుకోవడం కాంగ్రెస్ నాయకత్వంకు ఆందోళన కలిగిస్తుంది.
 
తెలంగాణలో పార్టీకి వచ్చిన ఎంపీ ఫలితాలు నిరాశ కలిగించాయని సీఎం రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ అన్నట్టు తెలిసింది. సుమారు 12 సీట్లు ఆశించగా అంత తక్కువ ఎందుకొచ్చాయని అడిగినట్టు సమాచారం.  సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో రేవంత్ రెడ్డి జరిపిన భేటీలలో ఈ అంశమే ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో ఎంపీ ఫలితాలు, పార్టీ, ప్రభుత్వ పరిస్థితిపై వీరికి రేవంత్ వివరణ ఇచ్చుకోవలసి వచ్చినట్టు తెలిసింది. 
 
ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై ఆరా తీసిన సోనియా గాంధీ ముఖ్యంగా ఎంపీ ఫలితాలపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వంలో ఉంటూ బీజేపీతో సమానంగా సీట్లు రావడం ఏమిటి? అని ప్రశ్నించారని తెలిసింది. ఎక్కడ లోపం జరిగిందని, కారణం ఏమిటని అడిగినట్టు సమాచారం. ఉత్తరాదితో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధిస్, ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలంగాణ, కర్ణాటకల్లో మాత్రం పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తున్నది.
 
మరోవంక, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని మల్లికార్జున ఖర్గే  కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో అసంతృట్ఫి వ్యక్తం చేశారు. “కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగలేదు. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్లు ఈ రాష్ట్రాల్లో ఫలితాలు రాలేదు” అంటూ ఆయన పేర్కొనడం రేవంత్ రెడ్డి పనితీరును ప్రశ్నించిన్నట్లుగా పలువురు భావిస్తున్నారు.
 
ఇలాంటి రాష్ట్రాలపై త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహించి, తక్షణమే వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని ఖర్గే తేల్చి చెప్పారు. ఇదే సమయంలో నూతన పిసిసి అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించినా ఆ అంశాలలో రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానం నుండి ప్రతికూల సంకేతాలు అందినట్లు చెబుతున్నారు. ఆయన సిఫార్సులకు ఏమాత్రం విలువ ఇస్తారో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.