రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి, ఆర్ఎస్ఎస్ సంతాపం

రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి, ఆర్ఎస్ఎస్ సంతాపం
ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (88) అస్తమయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు.  ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా సంతాపం ప్రకటించారు. రామోజీరావు మృతితో దేశం ఓ మీడియా దిగ్గజాన్ని కోల్పోయిందని కొనియాడారు. .
 
‘రామోజీ మరణంతో మీడియా, వినోద రంగం ఓ టైటాన్‌ను కోల్పోయింది. రామోజీరావు ఓ వినూత్న వ్యాపారవేత్త. ఈనాడు వార్తా పత్రిక, ఈటీవీ న్యూస్‌ నెట్‌వర్క్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీ సహా అనేక సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్రవేశారు. మీడియా, సినీ పరిశ్రమలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. పద్మవిభూషణ్‌ అందుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి ముర్ము తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ఈనాడు, రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు మృతి ముఖ్యంగా జర్నలిజం, సినిమా రంగానికి తీరని లోటు అంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబెల్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఎంచుకున్న రంగంలో ప్రత్యేక లక్షణాలు, అభ్యాసాలను జోడించడంలో మార్గదర్శకుడిగా అతని సహకారం చిరకాలం గుర్తుండిపోతుందని చెప్పారు.  మరణించిన ఆయన కుటుంబ సభ్యులకు, అసంఖ్యాక అభిమానులకు హృదయపూర్వక సానుభూతిని తెలిపాటు.  మరణించిన ఆత్మకు సద్గతి ప్రసాదించాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
 
రామోజీరావు  మృతి పట్ల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘ఈనాడు గ్రూప్‌, ఈటీవీ నెట్‌వర్క్‌, ఫిల్మ్‌ సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. కమ్యూనికేషన్‌ ప్రపంచానికి ప్రత్యేకంగా తెలుగు మీడియాకు ఆయన దార్శనికుడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. మంచి పరిచయం ఉంది. ఓసారి ఫిల్మ్‌సిటీకి నన్ను ఆహ్వానించారు. ఫిల్మ్‌సిటీ సందర్శన మధురానుభూతి నాకు ఇంకా గుర్తుంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభులాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని దీదీ పోస్ట్‌ పెట్టారు.

రామోజీ రావు మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. శోకతప్తులైన రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.