
ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనకు మద్దతు ఇస్తున్న ఎన్డీయే ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు. అనంతరం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్ము నరేంద్ర మోదీని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, మోదీ ఒకరికొకరు పుష్పగుచ్ఛాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
నరేంద్రమోదీకి రాష్ట్రపతి ఒక జ్ఞాపికను బహూకరించారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా రాష్ట్రపతి ఆహ్వానం మేరకు ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు మోదీ సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేసేలా ముహూర్తం కూడా నిర్ణయించారు. ఆ రోజు ప్రధానితోపాటే కొందరు మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నది.
కేంద్రంలో ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. అంతకు ముందు ఉదయం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి నరేంద్రమోదీని తమ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నాయి.
అనంతరం మోదీ పార్టీ కురువృద్ధులు ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. చివరగా రాష్ట్రపతి ముర్మును కలిసి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన అనంతరం నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు మూడోసారి సేవచేసే అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రపతిని కలిసి తనను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న తీర్మాన ప్రతిని ఆమె అందజేశానని చెప్పారు.
ఈ సందర్భంగా తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. ఎన్డీఏ మిత్రపక్షాల తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం ద్రౌపది ముర్ము మోదీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం తాను మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు మోదీ వెల్లడించారు.
ఆజాదీకా అమృత్ కాల్ ఉత్సవాల తర్వాత ఇవి తొలి ఎన్నికలని, దేశానికి సేవచేసే అవకాశం తమకు మూడోసారి లభించిందని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మంత్రిమండలి ఏర్పాటుకు రాష్ట్రపతి పలు సూచనలు చేశారని, ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త మంత్రుల పేర్లను రాష్ట్రపతికి అందజేస్తామని తెలిపారు. మున్ముందు మరింత బాధ్యత, ఉత్సాహంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సాధించిన ఘనతను సమం చేస్తూ 73 ఏళ్ల మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత రెండు దఫాలుగా దేశం ఎంత వేగంగా ముందుకు సాగిందో, అంతకుమించిన వేగంతో ప్రగతి సాధిస్తామని భరోసా ఇచ్చారు. ఈ 10 ఏళ్లలో ప్రతి రంగంలోనూ సానుకూల మార్పు కనిపిస్తోందని, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు.
మరోవైపు ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ శిండే సమావేశమయ్యారు. వీరంతా ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, తమ పార్టీల మద్దతు లేఖలను సమర్పించారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!