
ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకుంటున్న దాడుల అంశంపై గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు గురువారం సాయంత్రం తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ బీహార్ తరహాలో టీడీపీ దాడులు చేస్తోందని ఆరోపించారు. వైఎసార్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని ఆరోపించారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వైఎసార్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారని చెప్పారు.
“ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఫిర్యాదు చేశాం. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా ? పోలీసుల తీరుపై కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేశాం. నూజివీడులో పట్టపగలే వైసీపీ కౌన్సిలర్ పై టీడీపీ నేత కత్తితో దాడి చేసినా పట్టించుకోలేదు” అని పేర్ని నాని విమర్శించారు.
ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. “రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు” అంటూ జగన్ ఆరోపించారు.
2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఐదేళ్లుగా వైసీపీ తమను రాజకీయంగా వేధించిందనే ఆరోపణలతో పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అల్లర్లను అదుపు చేయడానికి రాష్ట్రంలో కేంద్ర బలగాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్