
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని మించి ఇండియా కూటమి ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సీట్లు గెలుపొందడంతో ఆ రాష్ట్ర మహిళలు ఎన్నికల వాగ్దానం అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ కార్యాలయం వద్ద బారులు తీరారు. ప్రచారం సమయంలో వాగ్దానం చేసినట్టుగా గ్యారెంటీ కార్డులను ఇవ్వాలని వారు కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు.
ప్రచారం సమయంలో కాంగ్రెస్ నేతలు పలువురు గృహిణులకు గ్యారెంటీ కార్డులను పంపిణీ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలు కుటుంబ పెద్దలుగా ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ.లక్ష అందజేస్తామని వాగ్దానం చేశారు. యూపీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధిక సీట్లను గెలుచుకుంది.
రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాలకు గాను ఎన్డీయే 37 సీట్లు గెలుపొందగా, ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. దీంతో పలువురు ముస్లిం మహిళలు గురువారం లక్నోలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద బారులుతీరి తమకు గ్యారెంటీ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందే గ్యారెంటీ కార్డులు అందకున్న మహిళలు తమ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వేయాలని కోరుతూ దరఖాస్తు పత్రాలు అందజేశారు.
తాము అందించిన పత్రాలకు కాంగ్రెస్ కార్యాలయం రశీదులు కూడా ఇచ్చిందని పలువురు మహిళలు తెలిపారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘ఘర్ ఘర్ గ్యారెంటీ (ఇంటింటికీ గ్యారెంటీ) పథకాన్ని ప్రారంభించింది. పార్టీ వాగ్దానం చేసిన 25 గ్యారెంటీలను కనీసం ఎనిమిది కోట్ల కుటుంబాల వద్దకు చేర్చాలని నాయకులకు టార్గెట్ విధించింది. ఈ గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి.
దారిద్య్ర రేఖకు దిగవున ఉన్న, మహిళలు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలకు నెలకు రూ.8,500 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని వాగ్దానం చేసింది. గత ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదేవిధమైన వాగ్దానం చేసింది.
కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.2000 చొప్పున అందజేస్తామని పేర్కొంది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, తమ ఖాతాల్లో నెలకు రూ.8,500 బదిలీ అవుతాయి అన్న ఆశతో ఇటీవల పలువురు మహిళలు బెంగళూరులోని జనరల్ పోస్ట్ ఆఫీసులో భారీ సంఖ్యలో ఖాతాలు ప్రారంభించారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం