రాష్ట్రపతికి ఎన్నికైన ఎంపీల జాబితా అందజేత

రాష్ట్రపతికి ఎన్నికైన ఎంపీల జాబితా అందజేత

లోక్‌సభ ఎన్నికల్లో విజేతల జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎలక్షన్‌ కమిషన్‌ గురువారం సమర్పించింది. రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 4:30 గంటలకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఈ జాబితాను రాష్ట్రపతికి అంద చేశారు. 

’18వ లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల తరువాత సభకు ఎన్నికైన సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 73 ప్రకారం రాష్ట్రపతికి సమర్పించారు’ అని రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈసీకి రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కోడ్‌ ఎత్తివేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది.

దీంతో 18వ లోక్‌సభను ఏర్పాటు చేసేందుకు అధికారిక ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం కానుంది. కాగా, కేంద్ర మంత్రివర్గం సిఫార్సును ఆమోదిస్తూ 17వ లోక్‌సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ మినహా 65.79 శాతం పోలింగ్‌ నమోదయింది. పోస్టల్‌ బ్యాలెట్‌ వివరాలు తరువాత తుది గణాంకాలు మారవచ్చని పేర్కొంది. మొత్తం 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఇటీవల విలేకరుల సమావేశంలో తెలిపారు. 

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 67.40 శాతం పోలింగ్‌ నమోదయింది. 2019లో దేశంలో 91.20 కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 61.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఏడాది ఎన్నికలకు ఓటర్ల సంఖ్య 96.88 కోట్లకు పెరిగింది.