
ఎన్డీయే పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే కూటమి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎన్డీయే కూటమి నేతలు మోదీని మూడోసారి ఎన్డీయే పక్షనేతగా ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీ రాజ్‌నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఎన్డీయే లోక్‌సభా పక్ష నేతగా మోదీ పేరును ప్రతిపాదించారు. రాజ్‌నాథ్ ప్రతిపాదనను అమిత్ షా, గడ్కరీ, చంద్రబాబు, నితీశ్ కుమార్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, కుమారస్వామి తదితరులు బలపరిచారు. దీంతో ఎన్డీయే పక్షనేతగా మోదీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం ఎన్డీయే కూటమి పార్టీల నేతలంతా మోదీకి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మోదీ ప్రసంగిస్తూ ఎన్డీయే పక్షనేతగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎన్డీయే పక్ష నేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. నాపై విశ్వాసం ఉంచి ఎన్డీయే నేతగా ఎన్నుకున్నారు. దేశానికి ఇంకా సేవచేసే భాగ్యం లభించింది. 22 రాష్ట్రాల్లో ఎన్డీయేకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఎన్నికలకు ముందే ఏర్పడే కూటమి.. ఎన్డీయేలాగా ఎన్నడూ విజయవంతం కాలేదు’ అని తెలిపారు.
`ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరం. కానీ ప్రభుత్వం నడపటానికి అందరి సహకారం అవసరం. అందుకే అందరి సహకారంతో ముందుకెళ్తాం’ అని మోదీ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయానికి కార్యకర్తలే కారణమని చెబుతూ రాత్రింబవళ్ల కష్టానికి ఫలితం దక్కిందని కొనియాడారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని, మండే ఎండలను అధిగమించి పనిచేశారని ప్రధాని కొనియాడారు. మిత్రపక్షాల కార్యకర్తలకు ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని మోదీ పేర్కొన్నారు.
ఎన్డీఏ నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మీరందరూ కొత్త బాధ్యతను అప్పగించారని, దానికి కృతజ్ఞతుడినై ఉంటానని తెలిపారు. 2019లో ఇదే సభలో మాట్లాడుతున్న సమయంలో అప్పుడు కూడా తనను నాయకుడిగా ఎన్నుకున్నారని, ఆ సమయంలో నమ్మకం ఎంత బలమైందన్న విషయాన్ని చెప్పానని గుర్తు చేశారు.
మన మధ్య ఉన్న విశ్వాస బంధం మరింత బలోపేతంగా మారిందని చెబుతూ ఈ బంధం ఓ బలమైన పునాది మీద ఏర్పడిందని చెప్పారు ఇదే అతిపెద్ద అసెట్ అని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతంలో ఎన్డీఏ కూటమి కొత్త రాజకీయాలకు తెరలేపిందని ప్రధాని మోదీ చెప్పారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ ఆ రాష్ట్రాల ప్రజలకు ఆ ప్రభుత్వాలతో బంధం తెగిపోయిందని, వాళ్లు భ్రమ నుంచి త్వరగా బయటకు వచ్చి, ఎన్డీఏను ఆమోదించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
తమిళనాడు కోసం పని చేసిన బృందాన్ని కూడా ఆయన అభినందించారు. తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవమన్న విషయం అందరూ చెప్పారని, కానీ తాము మాత్రం కలిసికట్టుగా పోరాడినట్లు వెల్లడించారు. తమిళనాడులో సీట్లు గెలవకున్నా.. అక్కడ మాత్రం ఎన్డీఏ ఓట్ షేర్ అమాంతంగా పెరిగిందని, ఇది స్పష్టమైన సందేశం ఇస్తోందని, రేపటి రోజు ఏం రాసి ఉందో చెబుతోందని తెలిపారు.
కేరళలో వందలాది మంది కార్యకర్తలు బలయ్యారని, కశ్మీర్ కన్నా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ప్రాణాలు కోల్పోయారని, కానీ తొలిసారి ఆ రాష్ట్రంలో తమ పార్టీ ఓ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. మోదీ దూరదృష్టిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూశారని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పదేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం దేశానికి విశేష సేవలందించిందని, ప్రపంచ దేశాల నేతలు సైతం మోదీని ప్రశంసిస్తున్నారని చెప్పారు. 1962 తర్వాత వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ గుర్తు చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నరేంద్ర మోదీ విజన్ ఉన్న నేతని, ఆయన విధానాలు, కార్యాచరణ మెరుగైన ఫలితాలు ఇస్తాయని ప్రశంసించారు. ఈరోజు భారత్ మోదీ వంటి సరైన నాయకుడి చేతిలో ఉందని, ఇది భారత్‌కు మంచి అవకాశమని చెప్పారు. ఈ అవకాశాన్ని మనం ఇప్పుడు కోల్పోతే మరెప్పటికీ ఇంతటి అవకాశాన్ని అందుకోలేమని పేర్కొన్నారు.
మోదీ మార్గదర్శకత్వంలో అభివృద్ధిలో భారత్ సరికొత్త శిఖరాలకు చేరుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాల్గొన్నారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?