
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో పోటీచేసిన గులాబీపార్టీ అభ్యర్థులు ఒక్కచోట గెలవకపోవడంతో, సంపూర్ణ పరాజయాన్ని మూటగట్టుకొంది. తెలంగాణలో గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్‌లోనూ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సార్వత్రిక ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న బీఆర్ఎస్, గౌరవప్రదమైన స్థానాలే లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థులను లోక్‌సభకు పంపాలని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రులు, నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఇవేవీ కూడా గులాబీ పార్టీకి కలిసి రాలేదు.
పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గం ఉన్న మెదక్‌పై బీఆర్ఎస్ భారీగా ఆశలు పెట్టుకొంది. ఎమ్మెల్యేలు ఉన్నందున మల్కాజిగిరి, సికింద్రాబాద్‌తో పాటు నాగర్ కర్నూల్, పెద్దపల్లి తదితర స్థానాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయని అనుకున్నారు. అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు.
చరిత్రలో ఏనాడు కూడా బీఆర్ఎస్కు ఇంత దారుణ ఫలితాలు రాలేదు. పార్టీ పెట్టిన తర్వాత 2004లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ ఐదు స్థానాలను గెల్చుకొంది. 2009లో మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసి కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014 లో ఒంటరిగా పోటీ చేసి అత్యధికంగా 11 స్థానాల్లో విజయం సాధించింది.
రాష్ట్రంలో రెండో మారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే