తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు వాస్తుపై అపారమైన నమ్మక ముందని, అందుకనే సచివాలయం భవనాలను కూల్చివేసి భవ్యమైన నూతన భవనాన్ని నిర్మించారని విశేషంగా ప్రచారం పొందింది. వాస్తు కారణంగానే ఆయన సచివాలయంకు హాజరు కాకుండా అధికార నివాసం నుండే అన్ని కార్యక్రమాలు నడిపించేవారు.

కొత్త సచివాలయం నిర్మించిన తర్వాతనైనా సచివాలయంకు వస్తారనుకొంటే రాలేదు. అధికార అనివాసంలోనే మంత్రివర్గ సమావేశాలు, ఇతర కీలక సమావేశాలు అన్ని జరుగుతూ ఉండెడివి. ముఖ్యమంత్రే సచివాలయంకు గైరాజరు అవుతూ ఉండడంతో మంత్రులు, సీనియర్ అధికారులు కూడా ఎక్కువగా కనిపించేవారు కాదు.

అయితే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత పరిస్థితి మారిందని అందరూ భావించారు. ఆయనతో పాటు మంత్రులు, సీనియర్ అధికారులతో సచివాలయం కళకళలాడుతూ వస్తున్నది. అయితే, ఆయన కూడా వాస్తుపై నమ్మకాలతో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది. అకస్మాత్తుగా ఆయన చేపట్టిన మార్పులే అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి.

సోమవారం అకస్మాత్తుగా ప్రధాన ద్వారం మూసివేయడం, ఎప్పటి మాదిరిగా ఆయన ప్రధాన ద్వారం నుండి కాకుండా తూర్పువైపు ద్వారం నుండి ప్రవేశించడంతో ఈ మార్పుల విషయం బైటపడింది. అనధికార ఆదేశాల మేరకు ఈ మార్పులు జరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పటివరకు సెక్రటేరియట్‌ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయి సెక్రటేరియట్‌లోకి వచ్చేది. కానీ ఇకపై వెస్ట్‌ గేట్‌ నుంచి లోపలికి వచ్చి నార్త్‌ ఈస్ట్‌ గేట్‌ నుంచి బయటకు వెళ్లిపోనున్నట్లు సమాచారం. ఇక సౌత్‌ ఈస్ట్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి.

 రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వాస్తు మార్పులు చేయించారు. గతంలో ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో సీఎంవో ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సెక్రటేరియట్‌ లోపల మరికొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆయన గతంలో టిపిసిసి అధ్యక్ష పదవి చేపట్టగానే పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో కొన్ని మార్పులు చేయించారు. ఆ మార్పులు ఆయనకు కలసి రావడంతో ఇప్పుడు కూడా అందుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.