తెలంగాణాలో కాంగ్రెస్ కు పోటీగా 8 సీట్లలో గెలుపు

ఆరు నెలల క్రితమే అసెంబ్లీ  ఎన్నికలలో గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్  లోక్ సభ ఎన్నికలలో తెలంగాణాలో చతికలబడింది. ఆ పార్టీకి పోటీగా బిజెపి సహితం ఘనవిజయాలు సాధించింది. దాదాపు అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ కు బిజెపి గట్టి పోటీ ఇచ్చింది.  కాంగ్రెస్ తో సమానంగా 8 సీట్లలో గెలుపొందింది.
 
ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. చాల నియోజకవర్గాలలో మూడో స్థానికే పరిమితమైపోయింది. కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలలో విజయం సాధించగా, ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసి మరోసారి హైదరాబాద్ నుండి గెలుపొందారు.
 
కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకే దాదాపుగా పరిమితమయింది. బిజెపి నుండి కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి తిరిగి గెలుపొందగా, మాజీ మంత్రి, బిజెపి ఉపాధ్యక్షురాలు డి కె అరుణ మహబూబ్ నగర్ నుండి గెలుపొందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతజిల్లాలో, ఆయన సొంత అభ్యర్హ్డిని ఆమె ఓడించారు.

 
బిజెపి ఎంపీలు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుండి, డి అరవింద్ నిజామాబాదు నుండి తిరిగి గెలుపొందారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుండి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నుండి, మాజీ ఎమ్యెల్యే ఎం రఘునందన్ రావు మెదక్ నుండి, జి నగేష్ ఆదిలాబాద్ నుండి బిజెపి అభ్యర్థులుగా గెలుపొందారు.

నల్గొండలో  మాజీ మంత్రి కె జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్గా 5.41 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆయన సోదరుడు ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎమ్యెల్యే. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామిరెడ్డి 4,56704 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోవైపు భువనగిరిలో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి  దాదాపు 2,04,441 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
 
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుపొందిన బీజేపీ ఏకంగా 8 లోక్ సభ స్థానాలను గెలుచుకొని తెలంగాణాలో తన సత్తా చాటుకొంది. 2019లో గెల్చుకున్న 4 స్థానాలకన్నా రెట్టింపు స్థానాలు గెలుపొందడం గమనార్హం.
కాగా, బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్, నివేదితపై గెలుపొందారు. దీంతో  అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65 చేరితే, బిఆర్ఎస్ బలం 38కి జారింది.