మూడు జోన్లుగా తెలంగాణ విభజన.. త్వరలోనే అభివృద్ధి ప్రణాళిక

రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజన చేస్తున్నామని, హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్‌ తెలంగాణ, ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతాన్ని సబ్‌ అర్బన్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు గ్రామీణ తెలంగాణ జోన్గా విభజిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలో మాట్లాడుతూ మూడు జోన్లలో అభివృద్ధి ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు, .

తెలంగాణ వచ్చి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదని, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఉండాలని అంతా అనుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారికంగా గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమయ్యి ఉండేది చిహ్నంలోనే అని తెలిపారు.“తెలంగాణ అంటేనే ధిక్కారం, తెలంగాణ అంటనే పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో ధిక్కారం, పోరాటం ప్రతిబింబించాలి. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందిస్తున్నాం” అని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు టీఎస్‌ను టీజీగా మార్చామని పేర్కొంటూ సగటు గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం కాగలదని తెలిపారు.

రాష్ట్రంలో తాలు, తరుగు లేకుండా, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటున్నారని తెలిపారు. రూ.7,500 కోట్లను ఖాతాలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. తెలంగాణకు డ్రీమ్‌ 20-50 మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని తెలిపారు. మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని చేపడతామని, సుందరీకరణ ద్వారా పరివాహక ప్రాంతంలో ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు. మూసీ సుందరీకరణకు రూ.వెయ్యి కోట్లు కేటాయించామని చెప్పారు.