పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

పోస్టల్‌ బ్యాలెట్లపై యాగీ చేసిన వైఎస్సార్సీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైఎస్సార్సీపీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్‌ ఉండాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై హైకోర్టు ఆదేశాలను వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. 4వ తేదీన కౌంటింగ్‌ ఉండగా ఈ దశలో జోక్యం చేసుకోవడం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది. 

గతంలో ఇదే అంశంపై వైఎస్సార్సీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించగా, జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ల పరంగా ఏవైనా పొరపాట్లు ఉంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల పిటిషన్ వేయాలని సూచించింది. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని కుండబద్దలు కొట్టింది.

కాగా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల ముందే కీలక ఆదేశాలు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్​కు సంబంధించి 13 ఎ ఫాంపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని తెలిపింది. సదరు పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని, వాటిని చెల్లుబాటు అయ్యే ఓటుగా గుర్తించాలని ఆర్వోలకు ఆదేశాలు జారీ చేసింది. 

రిటర్నింగ్ అధికారి ధృవీకరణ తరవాతే అటెస్టేషన్ అధికారి ఫాం 13 ఎ పై సంతకం చేశారని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ సైతం రాసింది. అయితే ఈసీ నిబంధనలపై వైస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో వైఎస్సార్​సీపీ హైకోర్టును ఆశ్రయించింది. 

దీనిపై విచారించిన న్యాయస్థానం, ఈసీ నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషనర్‌కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవాలన్న ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది.  ఈసీ సమర్పించిన పలు తీర్పులను సైతం పరిగణనలోకి తీసుకుంది.

ఎన్నికల కమిషన్ నిర్ణయంపై పిటిషనర్‌కి ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించే స్వేచ్ఛనిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.  అయితే సుప్రీంకోర్టులో కూడా వైఎస్సార్సీపీకి చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమంటూ తేల్చిచెప్పింది. ఏవైనా పొరపాట్లు ఉంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తైన తరువాత పిటిషన్ వేయాలని సూచించింది.

మరోవైపు చంద్రగిరిలో ఫాం-17ఏ, ఇతర డాక్యుమెంట్లు మరోసారి పరిశీలించాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలంటూ చంద్రగిరి వైసీఎస్సార్సీపీ అభ్యర్థి మోహిత్‌రెడ్డి పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు కొట్టివేసింది. జోక్యం చేసుకునేందుకు కారణాలేమీ కనిపించట్లేదని న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ మోహిత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే జోక్యం చేసుకోలేమంటూ మోహిత్‌రెడ్డి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.