కౌంటింగ్‌ కేంద్రంలోకి రావొద్దని పిన్నెల్లికి సుప్రీంకోర్టు ఆంక్షలు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ‌ష్ణారెడ్డిని కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిన్నెలి రామకృష్ణ రెడ్డి కి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇచ్చిన రక్షణపై టీడీపీ పోలింగ్‌ ఏజెంట్‌ నంబూరి శేషగిరి రావు దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

పిన్నెల్లికి ఇచ్చిన సడలింపులను పరిశీలించిన న్యాయస్థానం ఇది న్యాయాన్ని అవహేళన చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ న్యాయవాది ఆదినారాయణ, జవ్వాజి శరత్లు వాదనలు వినిపిస్తూ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన వెబ్ కాస్టింగ్ వీడియోలను ధర్మాసనానికి ప్రదర్శించారు. వాటిని చూసి న్యాయమూర్తులు రామకృష్ణా రెడ్డి కి సంభందించిన న్యాయవాదిని దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

తానేమీ అనదలుచుకోలేదని చెప్పడతో కోర్టు ఉత్తర్వులను వెలువరించింది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కౌంటింగ్ కేంద్రం పరిసరాలలోకి రాకూడదని ఆ విధంగా ఒప్పుకుంటున్నట్టు అఫిడవిట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణలో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొనీ మాత్రమే హైకోర్టు తగిన ఉత్తర్వులు వెలువరించాలని పేర్కొంది.

మే 13న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202)లోకి వెళ్లి, అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతోపాటు వీవీ ప్యాట్ మిషన్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారి పోలింగ్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న విపక్ష పార్టీ పోలింగ్ ఏజెంట్‌, టీడీపీ నేత నంబుల శేషగిరిరావుపై ఒక్క ఉదుటున దూసుకెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దృశ్యాలన్నీ పోలీంగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన అనంతరం అడ్డుకోబోయిన టీడీపీ నేత నంబుల శేషగిరిరావుపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. గ్రామస్థులు ఎదురుతిరగడంతో అనుచరులతో సహా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ నుంచి పరారయ్యారు. సంబంధిత వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు టీడీపీకి గట్టి పట్టున్న గ్రామం. పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయన్న ఉక్రోషంతో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని వెంటేసుకుని బూత్​లోకి దూసుకెళ్లారు.

నంబూరి శేషగిరిరావు తనకు ప్రాణభయం ఉందని, పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆశ్రయించిన నేపథ్యంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈ నెల 4న జరిగే ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.