తెలంగాణాలో పలు జిల్లాల్లోనూ కుండపోత వర్షం

ఏపీలో నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ కుండపోత వర్షం కురిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను వర్షం ముంచెత్తింది. వర్షంతో పలుచోట్ల కాలనీలు నీట మునగగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఏపీలో నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ కుండపోత వర్షం కురిసింది.

మధ్యాహ్నం దాకా భానుడు ప్రతాపం చూపించగా సాయంత్రం వరకు మొత్తం చల్లబడింది. పలుచోట్ల మేఘాలు కమ్మేసి మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌, ఉప్పల్‌, రామంతాపూర్‌, చిలుకానగర్‌, మేడిపల్లి, బోడుప్పల్‌, ఫీర్జాదిగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

వర్షంతో పలుచోట్ల కాలనీలు నీట మునగగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో కరీంనగర్‌లో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలకు ఉపశమనం లభించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఈదురు గాలులకు పలుచోట్ల మామిడికాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రక్షించుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోవడంతో నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. హనుమకొండ, కాజీపేటలో ఈదురు గాలులతో వర్షం కురవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

వికారాబాద్ జిల్లా తాండూరులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జైదుపల్లి గ్రామంలో పిడుగుపడి లోట్ల రాములు అనే రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

ఈ క్రమంలో జిల్లా కేంద్రానికి 5 కి.మీ దూరంలో ఉన్న గుండి వాగుపై మట్టితో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక వంతెన నీటి ప్రవాహంలో కొట్టుకుని పోవడంతో ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని పలు గ్రామాల్లో స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. వరంగల్, హనుమకొండల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.