‘ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023’గా విరాట్ కోహ్లీ

టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు. టి20 ప్రపంచ కప్ కోసం అమెరికా చేరుకున్న విరాట్ ఐసిసి నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆదివారం ఐసిసి విరాట్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందజేసింది.  2023లో అద్భుతమై బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించిన కోహ్లీ.. ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డుకు ఎంపికయ్యాడు. దీంతో వరల్డ్ కప్ సందర్భంగా ఆ ట్రోఫీని అందుకున్నాడు.

దాంతో పాటు ‘ఐసీసీ మెన్స్‌ వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023’ క్యాప్‌ను కూడా ఇదే వేదికగా స్వీకరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ. ‘దేవుడు ప్లాన్ చేసిన బేబీ’ ఇది. అంతేకాదు ఐసిసి షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 టోఫీని విరాట్ తలపై పెట్టుకొని ఖుషీ అవుతున్నాడు. 

ఇక భారత్ జట్టు 2023కు గానూ డిఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది. అందుకే వరల్డ్ కప్ కోసం న్యూయార్క్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఐసిసి ఈ టోపీలతో ఘన స్వాగతం పలికారు.

2023లో తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. కొన్నేళ్ల పాటు ఫామ్ కోల్పోయిన ఈ రన్నింగ్ మెషిన్​, పలు మ్యాచుల్లో మంచి స్కోర్ చేయడానికి నానా తంటాలు పడ్డాడు. అయితే 2023లో అత్యుత్తమ ఫామ్ చూపించి సత్తా చాటాడా. 27 వన్డేల్లో 1337 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. ఇక అతడి బెస్ట్ స్కోరు 166గా నమోదైంది.

మరోవైపు 2023 ఆసియా కప్​లోనూ కీలక పాత్ర పోషించాడు. సూపర్ ఫోర్ స్టేజ్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 94 బంతుల్లో 122 పరుగులు చేసి రికార్డు సాధించాడు. అంతేకాకుండా గతేడాది సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్​లోనూ 11 మ్యాచుల్లో 765 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఆరు హఫ్ సెంచరీలు ఉండగా, అతని బెస్ట్ స్కోర్ 117.

ఆ టోర్నమెంట్‌ను టాప్ స్కోరర్‌గా ముగించిన విరాట్, అదే వరల్డ్ కప్​ ఎడిషన్​లో సచిన్ నమోదు చేసిన 673 పరుగులను బీట్ చేశాడు. 2003 వరల్డ్ కప్ టోర్నీలో సచిన్ సాధించిన 49 వన్డే సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ 15 మ్యాచ్‌లు 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం విరాట్ ఫామ్ టీమ్ఇండియాను ఊరిస్తోంది. వెస్టిండీస్, యూఎస్ఏలు వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు విరాట్ కూడా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఈవెంట్‌లో జరగనున్న తొలి మ్యాచ్‌కు విరాట్ ఓపెనర్‌గా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.