64.2 కోట్ల ఓట్లతో భారత్‌ ప్రపంచ రికార్డు

ప్రపంచంలోనే అత్యధికంగా 64.2 కోట్ల మంది ప్రజలు ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు సందర్భంగా ఏడు విడతల పోలింగ్‌ జరిగిన తీరును, ప్రత్యేకతలను రాజీవ్ కుమార్‌, మిగిలిన ఇద్దరు కమిషనర్లతో కలిసి సోమవారం వెల్లడించారు. 
 
దేశవ్యాప్తంగా 68 వేల పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేశామని, భద్రత, పోలింగ్ సిబ్బంది కలిపి 1.5 కోట్ల మంది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని వివరించారు.  నగదు, ఉచితాలు, డ్రగ్స్‌, మద్యం కలిపి ఎన్నికల సందర్భంగా రూ. పది వేల కోట్ల విలువైన సొత్తును జప్తు చేసినట్లు రాజీవ్‌ కుమార్‌ వివరించారు. 2019లో ఈ మొత్తం కేవలం రూ.3 వేల 500 కోట్లేనని చెప్పారు. 
 
అన్ని పార్టీలు లెవనెత్తిన అంశాలను పరిశీలించినట్లు చెప్పారు. అగ్రనేతలకు కూడా నోటీసులు ఇచ్చామని, చాలామందిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా సాగేలా చూసేందుకు చాలామంది అధికారులను బదిలీ చేసినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు.  కేవలం 39 చోట్ల రీపోలింగ్ చేయాల్సి వచ్చిందన్న ఆయన, 2019లో 540 చోట్ల రీపోలింగ్ చేసినట్లు తెలిపారు. గత 4 దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో అత్యధికంగా 51.05 శాతం పోలింగ్‌ నమోదైందని వివరించారు. అక్కడ 58.58శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. 
 
“64.2 కోట్ల మంది భారతీయ ఓటర్లతో మనం ప్రపంచ రికార్డు సృష్టించాం. ఇది మనందరికీ చారిత్రక అంశం. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ ఎన్నికల ప్రక్రియలోనైనా మన దగ్గరే ఎక్కువ మంది ఓటర్లు ఓటేశారు. ఈ సంఖ్య అన్ని జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. అలాగే 27 దేశాలకంటే మన ఓటర్లు 2.5 రెట్లు ఎక్కువ. అదీ మన భారతీయ ఓటర్ల అద్భుతమైన శక్తి” అంటూ ఎన్నికల పక్రియ గురించి రాజీవ్ కుమార్ కొనియాడారు .
 

 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు కూడా ప్రపంచంలోనే ఎక్కువ అంటూ 2019లో కంటే ఎక్కువ అని, సంఖ్యలోనూ, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడంలో కూడా ఎక్కువే అంటి అందుకే మన ఓటర్లందరికీ నిలబడి చప్పట్లతో అభినందనలు తెలపాలని మేము కోరుకుంటున్నామని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులను, జిల్లా పాలనాధికారులను ప్రభావితం చేశారనే ఆరోపణలకు ఆధారాలు ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సీఈసీ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు మొదలయ్యేలోపు వారెవరో చెప్పాలని సూచించారు. పుకార్లు వ్యాప్తి చేసి, అనుమానపు నీడలోకి అందరినీ లాగలేరని రాజీవ్ కుమార్‌ స్పష్టంచేశారు. 

150 మంది కలెక్టర్లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడి, ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన ఆరోపణలపై ఈ మేరకు సీఈసీ స్పందించారు. 70 ఏళ్ల నుంచి ఉన్న భారత ఎన్నికల వ్యవస్థలో అన్నీ నిమయనిబంధనల మేరకే జరుగుతున్నాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను వేసవి రాకముందే పూర్తి చేయాలనేది ఈ ఎన్నికల నుంచి తాము నేర్చుకున్న అతిపెద్ద విషయమని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు.

“మొత్తం ఎన్నికల ప్రక్రియలో పకడ్బందీ వ్యవస్థ ఓట్ల లెక్కింపే. మరెక్కడైనా ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉందని మేము అనుకోవడంలేదు. ప్రతి అంశం ముందే నిర్ణయించి ఉంటుంది. ఆరు గంటలకు ఏం చేయాలి. ఆరుంపావుకు ఏం చేయాలి, ఆరున్నరకు ఏం చేయాలి. ఒకటి తెరిచిన తర్వాతే రెండోదానికి వెళ్లాలి. అభ్యర్థి ఎక్కడుండాలి, ఇలా కౌంటింగ్‌ ప్రక్రియను మొత్తం క్రోడీకరించాం” అని తెలిపారు. 
 
అక్కడ సూక్ష్మపరిశీలకులు, పరిశీలకులు ఉంటారని, తక్కువలో తక్కువ 87 వేలమంది వ్యక్తుల సమక్షంలో ఈ పని జరుగుతుందని పేర్కొంటూ ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరగవని, వ్యవస్థలో ఏ తప్పూలేదని స్పష్టం చేశారు.

జైరాం రమేశ్​ విజ్ఞప్తికి ఈసీ నో

మరోవైపు ఆధారాలు సమర్పించడానికి అదనపు సమయం కావాలంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన విజ్ఞప్తిని ఈసీ తిరస్కరించింది. 150 మంది కలెక్టర్లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారని చేసిన ఆరోపణలకు ఆదివారం సాయంత్రంలోగా ఆధారాలు ఇవ్వాలని ఈసీ కోరింది. దీనికి స్పందించిన రమేశ్​, మరో వారం అదనపు సమయం ఇవ్వాలని కోరగా ఈసీ తిరస్కరించింది. సోమవారం రాత్రి 7 గంటలలోగా ఆధారాలు సమర్పించాలని తేల్చిచెప్పింది.