ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తే సహించొద్దు

లోక్‌సభ ఎన్నికల కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుండటంతో ప్రధాన పార్టీలు తమ విజ్ఞాపనలతో ఎన్నికల కమిషన్‌ను కలుస్తున్నాయి. ‘ఇండియా’ కూటమి ప్రతినిధిలు ఆదివారంనాడు ఈసీని కలిసి పలు విజ్ఞాపనలు చేయగా, ఆ కొద్ది సేపటికే బీజేపీ ప్రతినిధుల బృందం ఈసీని కలిసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని బీజేపీ ప్రతినిధుల బృందంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, సంజయ్ మయూఖ్, ఓంప్రకాశ్ ఉన్నారు.
 
కాగా, ఈసీతో సమావేశానంతరం మీడియోతో పీయూష్ గోయెల్ మాట్లాడుతూ, భారతదేశ సమున్నత ఎన్నికల ప్రక్రియ సమగ్రతను బలహీన పరచేందుకు కాంగ్రెస్ సహా కొన్ని పౌర సంఘాలు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భారత ప్రజాస్వామిక వ్యవస్థపై కాంగ్రెస్ దాడి చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
 
ఈ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా, మెరుగైన రీతిలో జరిగాయని స్పష్టం చేశారు. దేశంలోని బలమైన నేతలు, ఎదుగుతున్న దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు దాడులు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఒకవేళ వారు గెలిస్తే సత్యమేవ జయతే అంటారని, లేకుంటే ప్రశ్నలు లేవెనత్తుతారని తప్పుపట్టారు.
 
ఈసీ దృష్టికి ప్రధానంగా నాలుగు అంశాలు తీసుకువచ్చినట్టు గోయెల్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రతి అధికారి ఈసీ ప్రోటోకాల్‌ను తూ.చ. తప్పకుండా పాటించేలా చూడాలని, కౌంటింగ్, ఎన్నికల ఫలితాలు ప్రకటించే సమయంలో ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలక్కుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని చెప్పారు. 
 
ఎన్నికల ప్రక్రియను ఒక పద్ధతి ప్రకారం బలమైన పరిచేందుకు ప్రయత్నించే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతను వివరిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియకు దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలు సహించేది లేదని బహిరంగ ప్రకటన చేయాలని ఈసీని కోరినట్టు పీయూష్ గోయెల్ చెప్పారు.

అంతకు ముందు, పోస్టల్ బ్యాలెట్లను మొదటగా లెక్కించి, ఫలితాలను ప్రకటించిన తర్వాతే ఈవీఎంలు తెరవాలని ప్రతిపక్ష నేతలు ఈసీకి విజ్ఞప్తి చేశారు. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారం సెక్షన్ 54 ఏ నిబంధనను కచ్చితంగా పాటించాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనను అనేక ఏళ్లుగా ఎన్నికల సంఘం అనుసరిస్తుందని, కానీ 2019లో దీనికి స్వస్తి చెప్పారని తెలిపారు. 

ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిష్పపక్షపాతంగా నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. ఈసీని కలిసిన వారిలో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీతో పాటు సీపీఐ నేత డీ రాజా, సీపీఏం నేత సీతారాం ఏచూరి సహా పలు పార్టీల నేతలు ఉన్నారు.