పోస్టల్ బ్యాలట్ లో వైసీపీకి హైకోర్టులో చుక్కెదురు

పోస్టల్ బ్యాలట్ లో వైసీపీకి హైకోర్టులో చుక్కెదురు
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పోస్టల్ బ్యాలెట్లపై సీల్, హోదా వివరాల విషయంలో ఎన్నికల సంఘంతో ఆదేశాలతో ఏకీభవిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. జస్టిస్ విజయ్, జస్టిస్ కిరణ్మయి బెంచ్ పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ వేసిన పిటిషన్ పై తీర్పు వెలువరిచింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమోలో కలగచేసుకోలేమని స్పష్టం చేసింది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కీలక సూచనలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా సంతకం ఉన్నా సరిపోతుందంటూ ఆదేశాలు జారీచేసింది. ఇదే సమయంలో సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక 13ఏ మీద అటెస్టింగ్ అధికారి పేరు, వివరాలు లేకున్నా కూడా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. 

 
అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఆర్వో సీల్ లేకున్నా అనుమతించాలనే ఈసీ మార్గదర్శకాలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ మీద శుక్రవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.  శనివారం సాయంత్రం వైసీపీ వేసిన పిటిషన్ మీద హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 
 
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఈసీ నిబంధనలతో ఏకీభవించిన హైకోర్టు వైసీపీ వేసిన పిటిషన్ కొట్టివేసింది. అటువంటి వివాదాలు కేవలం ఎలక్షన్ పిటిషన్ ద్వారా మాత్రమే పరిష్కరించాలని చట్టం చెబుతోందని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్లకు చట్టరీత్యా ఉన్న ఇతర అవకాశాలు పొందటానికి హైకోర్టు అవకాశం కల్పించింది.
 
 ఏపీ ఎన్నికల్లో ఈసారి భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎవరి వైపు ఉన్నారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకతతోనే కూటమికి ఓట్లు వేశారని టీడీపీ నేతలు చెప్తుండగా ఇదంతా పాజిటివ్ ఓట్లను వైసీపీ చెప్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై హైకోర్టు తీర్పుతో కౌంటింగ్ మరింత ఆసక్తికరంగా మారింది.