చివరి దశలో 62% పోలింగ్‌

చివరి దశలో 62% పోలింగ్‌
లోక్‌సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ఎన్నికల పర్వంలో చివరి(ఏడో) దశ పోలింగ్‌ శనివారం జరిగింది. 8 రాష్ర్టాల్లోని 57 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11.45 గంటల వరకు 61.63 శాతం పోలింగ్‌ నమోదైంది. 
 
పశ్చిమబెంగాల్‌లో స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని ఈసీ అధికారులు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గానికి ఈ తుది దశలోనే పోలింగ్‌ జరిగింది. పంజాబ్‌లోని 13 స్థానాలు, యూపీ-13, హిమాచల్‌ప్రదేశ్‌-4, పశ్చిమబెంగాల్‌-9, బీహార్‌-8, ఒడిశా-6, జార్ఖండ్‌లో మూడు స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 
 
అదేవిధంగా ఒడిశా అసెంబ్లీకి కూడా చివరి దశలో భాగంగా 42 స్థానాలకు, హిమాచల్‌లోని ఆరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్‌ 19న తొలి దశతో ఎన్నికల పర్వం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి ఆరు దశలో వరుసగా 66.14, 66.71, 65.68, 69.16, 62.2, 63.36 శాతాల పోలింగ్‌ నమోదైంది.

పశ్చిమబెంగాల్‌లో ఘర్షణలు

పశ్చిమబెంగాల్‌ సందేశ్‌ఖాలీలోని బైరామరిలో ఎన్నికల అక్రమాల ఆరోపణలపై బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతోపాటు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఘర్షణల్లో ముగ్గురికి గాయాలయ్యాయని బసిర్‌హత్‌ ఎస్పీ తెలిపారు. 

జాదవ్‌పూర్‌, డైమండ్‌ హార్బర్‌ నియోజకవర్గాల్లోనూ ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. పోలింగ్‌ కేంద్రాల్లోకి తమ పార్టీ ఏజెంట్లకు రాకుండా అడ్డుకొన్నారని ఆరోపిస్తూ టీఎంసీ, బీజేపీ, ఐఎస్‌ఎఫ్‌ మద్దతుదారులు జాదవ్‌పూర్‌లో గొడవపడ్డారు. జాదవ్‌పూర్‌లోని భాంగర్‌ ఏరియాలో ఒకరిపై ఒకరు నాటుబాంబులు వేసుకొన్నట్టు సమాచారం.

దక్షిణ 24 పరగణాల జిల్లా కుల్తాలిలో పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడిన కొంత మంది.. ఈవీఎంలను తీసుకెళ్లి చెరువులో పడేశారు. జయనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని బేనిమాధవ్‌పూర్‌ ఎఫ్‌పీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలోకి ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకొన్న నేపథ్యంలో ఉదయం సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. ఆగ్రహించిన స్థానికులు.. వీవీప్యాట్‌తో సహా ఈవీఎంను, పోలింగ్‌కు సంబంధించిన పలు పేపర్లను తీసుకెళ్లిపోయారు.

4న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌

లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఈనెల 4న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుందని ఎన్నికల సంఘం శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. కౌంటింగ్‌ ఏర్పాట్లు, కౌంటింగ్‌ ప్రక్రియ, ఈవీఎంలు, పేపర్‌ ట్రయల్‌ మెషిన్ల స్టోరేజ్‌కు సంబంధించి కొన్ని తాజా మార్గదర్శకాలను షేర్‌ చేసింది. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ టేబుల్‌పై మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది.