ఎన్డీఏదే మరోసారి అధికారం… తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్

2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎన్డీఏదే మరోసారి అధికారం అని దాదాపు అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా తేల్చిచెప్పాయి. సీట్ల సంఖ్యలో అంచనాలు వేరుగా ఉన్నప్పటికీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీనే అధికార పగ్గాలు చేపడతారని తేల్చిచెప్పాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చూసుకుంటే ఎన్డీఏ కూటమికి కనిష్ఠంగా 242 సీట్లు, గరిష్ఠంగా 392 సీట్లు వస్తాయని వివిధ సర్వే సంస్థలు అంచనా వేశాయి.

దైనిక్ భాస్కర్, జన్‌కీ బాత్, న్యూస్ నేషన్, రిపబ్లిక్ భారత్‌మాట్రిజ్, రిపబ్లిక్ పి మార్క్, ఇండియా న్యూస్‌డి డైనమిక్స్ తదితర సంస్థలు మళ్లీ బిజెపిదే అధికారమని చాటి చెప్పాయి. గతంతో పోల్చితే దక్షిణాదిలో కమలం మరింత విరబూయడం ఖాయంగా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కైవసం చేసుకొని డబుల్ డిజిట్ దక్కించుకోబోతోందని వివరించాయి.

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో మమతతో హోరాహోరీగా తలపడుతున్న బిజెపి ఈ సారి అవసరమైతే టిఎంసిని మించిపోతోందని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఇక ఇండియా కూటమి గరిష్టంగా 200 మార్కును చేరుకునే అవకాశాలున్నాయి. కొన్ని సంస్థలైతే ఆ కూటమికి 150 స్థానాలు కూడా గగనమేనని ఘం టాపథంగా చెప్పాయి.

సార్వత్రిక సమరంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి 350కుపైగా స్థానాలు వస్తాయని ఇండియా న్యూస్‌-డీ డైనమిక్స్‌ సర్వే సంస్థ వెల్లడించింది. బీజేపీకు 371కుపైగా స్థానాలు వస్తాయ, కాంగ్రెస్‌ 125 సీట్లు గెలుస్తుందని ఇతరులకు 47 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్‌ భారత్‌ పీమార్క్‌ కూడా ఇదే రకమైన అంచనాలను వెలువరించింది. 

బీజేపీకు 359కుపైగా సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌ పార్టీ 154 సీట్లకే పరిమితం అవుతుందని, ఇతరులకు 30 స్థానాలు దక్కుతాయని రిపబ్లిక్‌ భారత్‌ పీ మార్గ్‌ అంచనా వేసింది. రిపబ్లిక్‌ భారత్‌ మ్యాట్రిజ్‌ కూడా బీజేపీ గాలి బలంగా వీచిందని వెల్లడించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు 353 నుంచి 368 స్థానాలు వస్తాయని ప్రతిపక్ష ఇండియా కూటమికి కేవలం 118 నుంచి 133 స్థానాలే రావచ్చని తెలిపింది. ఇతరులకు 43 నుంచి 48 స్థానాలు వస్తాయని వెల్లడించింది.

జన్‌ కీ బాత్ సర్వే కూడా ఎన్డీఏ కూటమికే పట్టం కట్టింది. కమలం పార్టీ నేతృత్వంలోని కూటమికి 362 నుంచి 392 స్థానాలు వస్తాయని తెలిపిన జన్‌కీబాత్‌ సర్వే ఇండియా కూటమికి 161 స్థానాలు దాటబోవని తేల్చి చెప్పింది. ఇతరులకు పది నుంచి 20 స్థానాలు వస్తాయని వెల్లడించాయి.  న్యూస్‌ నేషన్‌ సర్వే కూడా కమలం పార్టీ వికసిస్తుందని అంచనా వేసింది. ఎన్‌డీఏకు 342 నుంచి 378 స్థానాలు వస్తాయన్న న్యూస్‌ నేషన్‌ సర్వే కాంగ్రెస్‌కు 153 నుంచి 169 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇతరులకు 21 నుంచి 23 స్థానాలు దక్కుతాయని వివరించింది.

దైనిక్‌ భాస్కర్‌ ఎగ్జిట్‌పోల్‌ కూడా ఎన్‌డీఏనే అధికారం చేపడుతుందని తేల్చి చెప్పింది. ఎన్‌డీఏకు 281 నుంచి 350 స్థానాలు వస్తాయని చెప్పిన దైనిక్‌ భాస్కర్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి 145 నుంచి 201 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇతరులు 33 నుంచి 49 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. 

ఇండియా టీవీ- సీఎన్‌ఎక్స్‌ కూడా దేశవ్యాప్తంగా బీజేపీ హవానే నడిచిందని అంచనా వేసింది. ఎన్డీఏ కూటమికి 371 నుంచి 401 స్థానాలు వస్తాయని, ఇండియా కూటమికి 109 నుంచి 139 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇతరులకు 28 నుంచి 38 స్థానాలు వస్తాయని వెల్లడించింది.  

కర్ణాటకలో ఎన్‌డిఎకు 23-25 సీట్లు వస్తాయని, ఇండియా బ్లాక్‌కు మూడు నుండి ఐదు మధ్య సీట్లు వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా పోల్‌ పేర్కొంది. బీహార్‌లో ఎన్‌డిఎకు 29-33 సీట్లు వస్తాయని, ఇండియా అలయన్స్‌కు 7-10 సీట్లు వస్తాయని తెలిపింది. కేరళలో ఎన్‌డిఎకు 2-3, వామపక్షాల కూటమి ఎల్‌డిఎఫ్‌కు 0-1, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌కు 17-18 వస్తాయని ఆ పోల్స్‌ అంచనా వేశాయి. 
 
తమిళనాడులో ఎన్‌డిఎ రెండు నుండి నాలుగు సీట్లలో గెలుపొందుతుందని, అన్నాడిఎంకె నేతృత్వంలోని కూటమికి 0-2 సీట్లు రాగా, ఇండియా బ్లాక్‌ పార్టీలు మొత్తంగా 33-37 స్థానాలు కైవసం చేసుకుంటాయని ఆ పోల్స్‌ పేర్కొన్నాయి. చత్తీస్‌గఢ్‌లో ఎన్‌డిఎకు 10-11, ఇండియా అలయన్స్‌కు 0-1 సీట్లను ఇవ్వగా, జార్ఖండ్‌లో ఎన్‌డిఎ 8-10 స్థానాలు గెలుస్తుందని భావిస్తున్నారు. ఇండియా అలయన్స్‌కు 4-6 స్థానాలు దక్కుతాయని పేర్కొన్నారు. 
 
గోవాలో గల రెండు సీట్లు ఎన్‌డిఎ, ఇండియా బ్లాక్‌లకు చెరొకటి వస్తాయని అంచనా. రాజస్థాన్‌లో ఎన్‌డిఎకు 16-19 వస్తాయని, ఇండియా అలయన్స్‌కు 5-7, ఇతరులకు 1-2 సీట్లు రావచ్చని మై యాక్సిస్‌ పేర్కొంది. ఇక మధ్యప్రదేశ్‌లో ఎన్‌డిఎ మొత్తంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. గుజరాత్‌లో కూడా ఇదే పరిస్థితి వుండబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.