తెలంగాణ చిహ్నం నుండి చార్మినార్ ను తొలగించే ధైర్యం ఉందా!

తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి సామాజిక చిహ్నమైన చార్మినార్ ను తొలగించే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని  బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నూతనంగా రూపొందించిన తెలంగాణ అధికారిక చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడాన్ని ఆయన స్వాగతించారు. ఎందుకంటే 1969-71 తొలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిన ఘటనలను మళ్లీ గుర్తుతెస్తున్నట్లుగా కనిపిస్తోందని తెలిపారు.
 
ఎన్నో అరాచకాలతో, హిందూ ఆడబిడ్డలను క్రూరంగా హింసించి, అనేక మందిపై మానభంగాలకు పాల్పడి చెలగాటం చేసిన ముస్లిం పాలకు చిహ్నాలను తొలగించే ధైర్యం ఈ ప్రభుత్వంకు ఉందా అని ఆయన నిలదీశారు.  నాడు వలసవాదులు, తెలంగాణ ప్రాంతంలో అరాచకంగా చొరబడిన ముస్లిం పాలకులు హిందూ సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకొని హిందువులను ఊచకోత కోశారని పేర్కొంటూ వారి ఆనవాళ్లను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 
 
తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ ను పూర్తిగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో అరాచక పాలన సాగించిన ముస్లిం పాలకుల చిహ్నాలు ఆనవాళ్లు చాలా ఉన్నాయని చెబుతూ బిజెపి అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తొలగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయి అని తెలంగాణ ప్రభుత్వ లోగోను మారిస్తే కొన్ని పట్టణాలు, జిల్లాల పేర్లు కూడా మార్చాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

 1.ఆదిలాబాద్(ఎదులాపురం)గా 2. నిజామాబాద్ (ఇందూరు)గా 3.జ‌హీరాబాద్ (పెద్దెక్కిలి)గా 4..క‌రీంన‌గ‌ర్ (ఎల‌గందల‌)గా 5.సికింద్రాబాద్ (ల‌ష్క‌ర్ లేదా ఉల్వులు) గా 6. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ (పాల‌మూరు) గా. 7. మ‌హ‌బూబాబాద్ (మానుకోట‌)గా పేర్లు ఇంకా స్ధానికులు వాడుతున్నారని గుర్తు చేశారు. వాటిని కాంగ్రెస్ స‌ర్కారు అధికారికంగా పున‌రుద్ద‌రించి తెలంగాణ సాంస్కృతిక పున‌రుజ్జీవ‌నానికి బాటలు వేయాలని బిజెపి నేత సూచించారు.

ఇక రాచ‌రిక‌పు గుర్తుల‌ను రాష్ట్ర చిహ్నంలోనే కాకుండా అస‌లు రాచ‌రిక‌పు ఆన‌వాళ్లను ప్ర‌త్యేకించి తెలంగాణ హిందువుల‌ ర‌క్త మాంసాల‌తో, ఆడ‌బిడ్డ‌ల మానాభిమానాల‌తో ఆట‌లాడుకుని, క్రూరంగా హింసించి, నిరంకుశ పాల‌న సాగించిన ముస్లిం పాల‌కుల గుర్తుల‌ను, ఆన‌వాళ్ల‌ను తెలంగాణ నుంచి లేకుండా చేయాల‌నేది బిజెపి డిమాండ్ అని ఆయన తెలిపారు. మ‌రి ముస్లిం ఓట్ల కోసం పాకులాడే రేవంత్ రెడ్డికి ముస్లిం పాల‌కుల గుర్తయిన చార్మినార్ ను తొల‌గించే ద‌మ్ము, ధైర్యముందా? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

నిజంగా రాచ‌రిక‌పు గుర్తుల‌ను తొల‌గించాల‌నే చిత్త‌శుద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగానే ఉంటే తెలంగాణ నుంచి దురాక్ర‌మ‌ణ దారులైన‌ ముస్లిం పాల‌కుల ఆన‌వాళ్లు లేకుండా చేయాలి కానీ, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందిన కాక‌తీయుల వంటి హిందూ పాల‌కుల గుర్తుల‌ను తొల‌గించ‌డం స‌రికాదని ఆయన హితవు చెప్పారు.

ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టో, హైద‌రాబాద్ యూత్ డిక్ల‌రేష‌న్ లో అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ తొలి, మ‌లి ద‌శ ఉద్య‌మాల‌లో ప్రాణాల‌ర్పించిన యువ‌తీ, యువ‌కుల‌ను ఉద్య‌మ అమ‌ర‌వీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగంతో పాటు, వారి తల్లి లేదా తండ్రి లేదా భార్య‌కు  ప్ర‌తినెలా రూ. 25 వేలు అమ‌ర‌వీరుల గౌర‌వ పెన్ష‌న్, ఇళ్ల స్థలాలు అంద‌జేస్తామ‌న్న హామీలను అమ‌లు చేయాల‌ని ఆయన డిమాండ్ చేశారు.

ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీనీ ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన బీజేపీ నేతలను విస్మరించడం సరికాదని మండిపడ్డారు.