మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఘన విజయం

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌  ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం. దీంతో సొంత జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత… బీఆర్ఎస్ కు దక్కిన తొలి విజయం ఇదే..!
గతంలో ఈ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ తరపున కసిరెడ్డి నారాయణ గెలిచారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరిన ఆయన… కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు.  మార్చి 28న పోలింగ్ జరిగినప్పటికీ సార్వత్రిక ఎన్నికల కారణంగా కౌంటింగ్‌లో జాప్యం ఏర్పడింది. జూన్ 2వ తేదీన ఫలితాలను ప్రకటించేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.  ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం.. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. 
 
బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో నవీన్‌ కుమార్‌ మొదటి ప్రాధాన్య ఓట్లతోనే కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1,437 ఓట్లు పోలవగా బీఆర్‌ఎస్‌కు 763, కాంగ్రెస్‌కు 652, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు చొప్పున వచ్చాయి. మరో 21 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు.