తెలంగాణలో కాంగ్రెస్‌‌కు బీజేపీ బిగ్ షాక్

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే దూకుడు ప్రదర్శింస్తుందని అందరూ ఊహించారు. లోక్ సభ ఎన్నికల్లో 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ముక్తకంఠంతో చెప్పారు. 
 
మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకొదగ్గ సీట్లు రాకపోయినా.. గతంలో కంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరగటం గమనార్హం. అయితే.. ఆ వచ్చిన కొంచెం ‘మెరుగైన ఓటింగ్ శాతం’ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే లోక్ సభ బరిలో దిగిన బీజేపీ.. అనూహ్య ఫలితాలు రాబట్టబోతున్నాం.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాం.. 17 స్థానాలకు గానూ 10 నుంచి 12 సీట్లు గెలుచుకోబోతున్నామంటూ.. బీజేపీ నేతలు ప్రకటిస్తూ వచ్చారు.

కాగా.. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిజమవుతుందో లేదో తెలియదు కానీ.. బీజేపీ మాత్రం నిజంగానే ఆశ్చర్యపరిచేలా కనిపిస్తోంది. శనివారం  విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చాలా సంస్థలు కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేయటం గమనార్హం. ఆరా మస్తాన్ సర్వే ఇచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేయగా, బీజేపీకీ 8 నుంచి 9 వస్తాయని చెప్పటం విశేషం. 

 
ఇక జన్ కీ బాత్ ఇచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్‌కు కేవలం 4 నుంచి 7 సీట్లే వస్తాయని చెప్పగా, బీజేపీకి మాత్రం ఏకంగా 9 నుంచి 12 స్థానాలు వస్తాయని చెప్పటం గమనార్హం. ఇక ఇండియా టీవీ- సీఎన్ ఎక్స్ సర్వేలో కూడా కాంగ్రెస్‌కు 6 నుంచి 8 సీట్లు వస్తే.. బీజేపీకి 8 నుంచి 10 సీట్లు రానున్నట్టు చెప్పింది. పొలిటికల్ ల్యాబరేటరీ సర్వే కూడా కాంగ్రెస్‌కు 6 (+/-) వస్తాయని చెప్తే.. బీజేపీకి 9 (+/-) వస్తాయని అంచనా వేసింది.
 
దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆయా సంస్థలు చెప్పినట్టుగా కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే మాత్రం ఇక తెలంగాణలో హస్తం దూకుడుకు కమల దళం బ్రేకులు వేయటమే కాకుండా భవిష్యత్తులో మరింతగా పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. 
 
ఇక.. దాదాపుగా అన్ని సంస్థలు బీఆర్ఎస్ ఒకటి లేదా సున్నాకే పరిమితం చేయటంతో గులాబీ పార్టీ ప్రభావం ఇంకా పతనమయ్యే దాఖలాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.