హైదరాబాద్‌తో ఏపీకి తెగిపోయిన బంధం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో అవశేష ఎపి, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేండ్ల గడువు జూన్ 1వ తేదీ అర్ధరాత్రి ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ తో ఉన్న పదేండ్ల ఉమ్మడి రాజధాని బంధం సమాప్తమైంది. హైదరాబాద్ పూర్తిస్థాయిలో తెలంగాణ రాజధానిగా కొనసాగనున్నది. 

దాదాపు పదేండ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగేలా విభజన చట్టంలో సెక్షన్ 5 ప్రకారం స్పష్టత, వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం తన పరిపాలనా కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి ఆ రాష్ట్రానికి తరలించుకున్నది. అక్కడే సొంతంగా సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టులను నిర్మించుకున్నది. దీంతో ఆచరణలో ఆ రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతున్నా విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ మాత్రం ఉమ్మడి రాజధానిగా కొనసాగింది.

ఉమ్మడి రాష్ట్ర విభజనతో అవశేష ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం 2014 జూన్ 2వ తేదీ నుంచి ఉమ్మడి రాజధానిగా కొనసాగింది.  పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలన్న నిబంధనతో 2024 జూన్ 1వ తేదీ అర్ధరాత్రి వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చెల్లుబాటు కాగా, అర్ధరాత్రి తర్వాత నుంచి హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పూర్తిస్థాయి రాజధానిగా ఉండనున్నది.

దీంతో ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ వాడుకున్న లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, లక్డీకాపూల్‌లో పోలీసు శాఖకు చెందిన భవనం (ఎపి సిబిసిఐడి అవసరాలకు), హెరిటేజ్ బిల్డింగ్ ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి రానున్నాయి. ఆ మూడు భవనాలను వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో అధికారులకు స్పష్టం చేశారు. 

ఎన్నికల కోడ్ కారణంగా విభజన చట్టం అంశంపై విధాన నిర్ణయాలు వద్దని, కేబినెట్ ఎజెండాలోని ఈ అంశాన్ని పక్కన పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. హైదరాబాద్ నగరంలోని ఆ మూడు భవనాలను వెంటనే ఎపి ఖాళీ చేయాల్సి ఉంటుంది. 

విభజన చట్టం ప్రకారం జూన్ 1వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఈ భవనాలపై ఎపికి ఎలాంటి అజమాయిషీ ఉండదు. ఈ మూడు భవనాలను అద్దెకు లేదా లీజుకు ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అభ్యర్థన వచ్చినట్లు తెలంగాణ సచివాలయ వర్గాలు తెలిపాయి. కానీ ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లేక్ వ్యూ గెస్ట్ హౌజ్‌ను తెలంగాణ కొన్ని ప్రత్యేక అవసరాలకు వాడుకోవాలని భావిస్తున్నది.