జగన్ అడుగు జాడల్లో తెలంగాణాలో రేవంత్ `బీర్ బ్రాండ్లు’

మొన్నటి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం ఒక ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. పేరొందిన బ్రాండ్ల మద్యం అమ్మకాలను కట్టడి చేసి బినామీ కంపెనీలతో తయారు చేయించిన చావుకబారు మద్యం బ్రాండ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సన్నిహితులు భారీ స్థాయిలో అమ్మకాలు జరిపి విపరీతంగా డబ్బు సంపాదించడమే కాకుండా, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడారనే విమర్శలు చెలరేగాయి.
 
బహుశా దేశ చరిత్రలోనే మద్యం బ్రాండ్ల కారణంగా ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఆ స్థాయిలో మరెక్కడా పెరగలేదని చెప్పొచ్చు. తాము అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వం అమ్ముతున్న చావుకబారు మద్యం బ్రాండ్లను నిషేధించి, నాణ్యమైన బ్రాండ్ల అమ్మకలకు అనుమతులు ఇస్తామంటూ టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చారు.
 
ఇప్పుడు తెలంగాణాలో సహితం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి అడుగు జాడలలో నడిచే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.  తెలంగాణ లో కూడా జగన్ ప్రభుత్వం తరహాలో కొత్త కొత్త బీర్ బ్రాండ్లకు అనుమతి అనుమతి ఇస్తూ పోతున్నారు. పోనీ అవి ఏమైనా దేశంలోని టాప్ టెన్ బీర్ బ్రాండ్లలో ఉన్నాయా అంటే అదేమీ లేదు.
 
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల హామీలు, ఇతర సమస్యల గురించి పట్టించుకోకుండా అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీర్ బ్రాండ్లపై దృష్టి సారించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పైగా, ఇతర రాస్త్రాలలో ఆంక్షలకు గురయిన వివాదాస్పద కంపెనీలకు అనుమతులు ఇస్తుండటం పలు విమర్శలకు దారి తీస్తోంది.
 
మద్యం సేవించే వారి సౌలభ్యం లేదా వారి అభిరుచులతో సంబంధం లేకుండా ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఆర్ధిక ప్రయోజనాల కోసమే ఇటువంటి బ్రాండ్లకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు చెలరేగుతున్నాయి.  దేశంలోని టాప్ టెన్ బీర్ బ్రాండ్స్ లో కింగ్ ఫిషర్, కార్ల్స్ బెర్గ్, బడ్ వైజర్, హెయిన్ కెన్ , కరోనా, బిరా 91 , ఫాస్టర్స్ , హాయీగార్డెన్ లు ఉన్నాయి.
విచిత్రం ఏమిటి అంటే డిమాండ్ ఉన్న బీర్లను పక్కన పెట్టి కొత్త కొత్త బ్రాండ్లను మద్యం సేవించేవారిపై రుద్దే ప్రయోజనం ప్రభుత్వం చేస్తుండటం విస్మయం కలిగిస్తుంది.  తెలంగాణ లో కొత్త గా సోమ్ డిస్టలరీస్ కే కాకుండా టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎక్సోటికా తదితర బ్రాండ్లకు కూడా అనుమతులు మంజూరు చేశారు. మరొకొన్ని మద్యం బ్రాండ్లకు కూడా అనుమతులు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు  తెలుస్తోంది.
 
తెలంగాణలో బీర్ల కొరత వాస్తవమేనని చెబుతూ డిమాండ్కు తగినట్లు రాష్ట్రంలో ఉత్పత్తి లేదని  ఆబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్  ప్రభుత్వ చర్యను సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.  గడిచిన ఐదు నెలల కాలంలో నాలుగు కొత్త బ్రాండ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.  కింగ్‌ఫిషర్ బ్రాండ్ డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తి చెయ్యడం లేదని శ్రీధర్ తెలిపారు. 
 
యాజమాన్యం తక్కువ ఉత్పత్తి చేయడం వల్ల బీర్‌కు కృత్రిమ కొరత ఏర్పడిందని వివరించారు. రాష్ట్రంలో సాధారణంగానే లిక్కర్ కంటే బీరు వాడకం ఎక్కువ. ఇందుకు తోడు వేసవిలో బీరు వాడకం మరింత అధికంగా ఉంటుంది. ఎండాకాలం రాగానే అమ్మకాలు జోరందుకుంటాయి. రోజుకు సగటున 2 లక్షల కేసులు అమ్ముడుపోతాయి.