ఎగ్జిట్ పోల్స్ కు ముందే బిజెపి గెలుస్తుందన్న ప్రశాంత్ కిశోర్

ఎగ్జిట్ పోల్స్ కు ముందే బిజెపి గెలుస్తుందన్న ప్రశాంత్ కిశోర్
ఎగ్జిట్ పోల్ 2024 ఫలితాలు విడుదల కావడానికి కొన్ని గంటల ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే సాధించబోయే సీట్ల సంఖ్యపై తన అంచనాను పునరుద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శనివారం ఏడో దశ పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6.30 గంటలకు పలు జాతీయ, ప్రాంతీయ వార్తా చానళ్లు, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయనున్నాయి.

మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ‘‘ఫండమెంటల్స్ ను పరిశీలించాలి. ప్రస్తుత ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నాయకుడిపైనా ఆగ్రహం ఉంటే ప్రత్యామ్నాయ పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉంది. మోదీజీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నట్లు ఇంతవరకు మనం వినలేదు. నిరాశ, నెరవేరని ఆకాంక్షలు ఉండవచ్చు, కానీ విస్తృతమైన కోపం అయితే లేదు’’ అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో, 2019 లో సాధించిన విధంగానే, బీజేపీకి 303 సీట్లు, లేదా అంతకంటే కొంచెం ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిశోర్ మరోసారి జోస్యం చెప్పారు. ‘‘పశ్చిమ, ఉత్తర భారతంలో సీట్ల సంఖ్యలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించడం లేదు. కానీ, తూర్పు, దక్షిణ భారతంలోని ప్రాంతాల నుంచి బీజేపీకి గణనీయంగా మద్దతు లభించింది’’ అని ప్రశాంత్ కిశోర్ ‘ది ప్రింట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సీట్ల సంఖ్య, ఓట్ల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ బాగా పుంజుకుందని తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

‘‘మోదీ నేతృత్వంలోని బీజేపీ తిరిగి వస్తోందని నేను అనుకుంటున్నాను. వారికి గత ఎన్నికల మాదిరిగానే సంఖ్యాబలం రావచ్చు లేదా కాస్త మెరుగైన సీట్లు రావచ్చు’’ అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.