ముగిసిన 45 గంట‌ల‌ ప్రధాని మోదీ ధ్యానం

ముగిసిన 45 గంట‌ల‌ ప్రధాని మోదీ ధ్యానం
లోక్‌స‌భ ఎన్నికల ప్రచారం ముగియడంతో కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల పాటు ఏకాంత ధ్యానముద్రలోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. 45 గంట‌ల పాటు ఆయ‌న చేప‌ట్టిన ధ్యానం శనివారం ముగిసింది. క‌న్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియ‌ల్‌లో ఆయ‌న ధ్యానం చేశారు. గురువారం సాయంత్రం 6.45 నిమిషాల‌కు ప్ర‌ధాని మోదీ ధ్యానంలో కూర్చున్నారు. ఈ నెల 30 నుంచి శనివారం వరకు ఆయన మూడురోజుల పాటు ధాన్య మండపంలోనే గడిపారు. 
 
 ధ్యాన స‌మ‌యంలో ఆయ‌న కేవ‌లం ద్ర‌వ ప‌దార్థాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 45 గంట‌ల పాటు మోదీ మౌనంగానే ఉన్నారు. కాషాయ దుస్తులు, జ‌ప‌మాల‌తో ధ్యాన మండపంలో ధ్యాన ముద్ర‌లో కూర్చుని ఉన్న మోదీ ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  ధ్యానంలో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో ఆయ‌న సూర్య భ‌గ‌వానుడికి అర్ఘ్యం స‌మ‌ర్పించారు. ఇవాళ మ‌ధ్యాహ్నం ధ్యానం ముగిసిన త‌ర్వాత ఆయ‌న వివేకానంద రాక్ మెమోరియ‌ల్ ప‌క్క‌నే ఉన్న త‌మిళ క‌వి తిరువ‌ల్లూరు విగ్ర‌హానికి పూల‌మాల వేసి న‌మ‌స్సుమాంజ‌లి అర్పించారు.

ధ్యానం ముగింపు సందర్భంగా తిరువళ్లవార్‌ విగ్రహం పాదాలకు నమస్కరించి.. పూలమాల వేశారు. ఇదిలా ఉండగా.. మార్చి 16న కన్యాకుమారి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని.. 75 రోజల్లో 183 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో ఎన్నికల సభలు, రోడ్‌షోలున్నాయి. అదే సమయంలో ప్రధాని మోదీ వివిధ మీడియా సంస్థలకు దాదాపు 80 ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు.