లోక్​సభ ఎన్నికలపై ‘ఇజ్రాయెల్’ సంస్థ కోవర్ట్‌ ఆపరేషన్‌

* అడ్డుకట్ట వేసిన చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ

దేశంలో సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరిన వేళ చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ సంస్థ సంచలన విషయాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన స్టాయిక్  అనే సంస్థ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక అజెండాతో లోక్‌సభ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యత్నించిందని పేర్కొంది. పెద్ద ఎత్తున ప్రజల అభిప్రాయాలను మార్చాలని ప్రయత్నించిందని తెలిపింది. 

అయితే తాము ఆ ప్రయత్నాలను అడ్డుకున్నామని ఓపెన్‌ ఏఐ వెల్లడించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో వెబ్‌ ఆర్టికల్స్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల్లో కామెంట్ల ద్వారా భారత ప్రజలను స్టాయిక్‌ (ఎస్‌టీఓఐసీ) లక్ష్యంగా చేసుకున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. 

ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని పేర్కొంది. ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించిన 24 గంటల్లోనే తాము గుర్తించినట్లు తెలిపింది. దీంతో మొదట్లో అడ్డుకట్ట పడిందని పేర్కొంది. ఎక్స్‌, మెటా వంటి వేదికలు కూడా ఆయా అకౌంట్లను తొలగించాయని తెలిపింది. 

కోవర్ట్‌ ఆపరేషన్ల ద్వారా మోసపూరిత విధానాల్లో నిర్దేశిత అంశాలను వ్యాప్తి చేసిందని చెప్పింది. కెనడా, అమెరికా, ఇజ్రాయెల్‌లోని వినియోగదారులను లక్ష్యంగా ఎంచుకుని ఆంగ్లం, హిబ్రూ భాషలలో, భారత్‌లోని వారిని లక్ష్యంగా ఎంచుకుని ఆంగ్లంలో సమాచార వ్యాప్తి యత్నాలు జరిగాయంది. ఆ సమాచారంలోని అంశాలను మాత్రం ఓపెన్‌ఏఐ వివరించలేదు.

అయితే 24 గంటల వ్యవధిలోనే వాటిని కృత్రిమ మేధ ద్వారా నిరోధించామని ఓపెన్‌ఏఐ తన వెబ్‌సైట్‌ ద్వారా శుక్రవారం తెలిపింది. దీంతో ఈ క్యాంపెయిన్‌ ప్రభావం పరిమితమేనని తెలిపింది. పారదర్శకతతో కూడిన సురక్షిత విధానాల్లో కృత్రిమ మేధను వినియోగించుకోవాలన్న తమ విధాన నిర్ణయంలో భాగంగా కోవర్ట్‌ ఆపరేషన్లను అడ్డుకున్నామని పేర్కొంది. తాము నిరోధించింది స్థాయిక్‌ కార్యకలాపాలను మాత్రమేనని ఆ సంస్థను కాదని తెలిపింది. 

మరోవైపు, ఓపెన్‌ఏఐ నివేదికపై ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటివి ప్రమాదకరమని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు దేశంలోనూ, వెలుపల ఈ తరహా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ నివేదికను ఇంకాస్త ముందుగా వెలువరించాల్సి ఉండేదని, ఇప్పటికే ఎన్నికలు తుది దశకు చేరాయని ఆయన అభిప్రాయపడ్డారు.