ఇంగ్లాండ్ నుంచి 100 టన్నుల బంగారం తరలించిన ఆర్బీఐ

ఇంగ్లాండ్ నుంచి ఆర్బీఐ సుమారు 100 టన్నుల అంటే లక్ష కిలోల బంగారాన్ని స్వదేశానికి తరలించింది. 1991 తర్వాత భారీ మొత్తంలో బంగారం తరలించడం ఇదే మొదటిసారి. 1991లో ఆర్థిక సంక్షోభం వల్ల భారత్ భారీగా బంగారం నిల్వలు తాకట్టు పెట్టింది. రవాణా, నిల్వ సర్దుబాట్లలో భాగంగానే ఆర్బీఐ భారీగా బంగారాన్ని తీసుకొచ్చింది.

కొన్నేండ్లుగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నది. అలా కొనుగోలు చేసిన బంగారం ఎక్కడ నిల్వ చేయాలన్న విషయమై సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నది ఆర్బీఐ. ముంబైలోని మింట్ రోడ్డుతోపాటు నాగ్‌పూర్‌లోని తన పాత కార్యాలయంలో బంగారం నిల్వ చేస్తుంది. 

విదేశాల్లో బంగారం నిల్వలు గణనీయంగా పెరగడంతో కొంత మొత్తం స్వదేశానికి తరలించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఆర్బీఐతోపాటు పలు దేశాల కేంద్రీయ బ్యాంకులు తమ బంగారాన్ని బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్‌లో నిల్వ చేస్తుంటాయి. 

గత మార్చి నెలాఖరు నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంటే, అందులో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసింది. ఇటీవల వరుసగా బంగారం కొనుగోళ్లు జరిపిన ఆర్బీఐ గతేడాది 27.5 టన్నుల పుత్తడిని కొత్త నిల్వల్లో చేర్చింది. ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు పెంచిన సెంట్రల్ బ్యాంక్.. గత జనవరి- ఏప్రిల్ మధ్య కాలంలో 2023 లో కొన్న బంగారానికంటే ఒకటిన్నర రెట్లు కొనుగోలు చేసింది.

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ మాట్లాడుతూ, “ఎవరూ చూడనప్పుడు,  ఆర్బీఐ తన 100 టన్నుల బంగారు నిల్వలను ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి తిరిగి తరలించింది” అని తెలిపారు. “చాలా దేశాలు తమ బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లేదా అలాంటి కొన్ని ప్రదేశాలలో ఉంచుతాయి ( అందుకు ప్రత్యేక హక్కు కోసం రుసుము చెల్లించాలి). భారతదేశం ఇప్పుడు తన సొంత వాల్ట్‌లలో చాలా బంగారాన్ని కలిగి ఉంటుంది” అని చెప్పారు.

భారత దేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో 1991లో రాత్రికి రాత్రే బంగారాన్ని రవాణా చేయవలసి వచ్చినప్పటి నుండి మనం ఇప్పుడు చాలా దూరం వచ్చామని ఆయన పేర్కొన్నారు. “నా తరానికి చెందిన వారికి, 1990-91లో బంగారం రవాణా చేయడం మనం ఎప్పటికీ మర్చిపోలేని వైఫల్యం. అందుకే ఈ బంగారం షిప్పింగ్‌కు ప్రత్యేక అర్థం ఉంది, ” అని ఆయన తెలిపారు. 

1991లో, అవసరమైన దిగుమతులకు చెల్లించడానికి డబ్బు లేకుండా దేశం తీవ్రమైన విదేశీ మరకద్రవ్య సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, నిధుల సేకరణ కోసం చంద్ర శేఖర్ ప్రభుత్వం బంగారాన్ని తాకట్టు పెట్టింది.  ఆర్బీఐ 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌ లకు $400 మిలియన్లకు హామీ ఇచ్చింది. భారత దేశపు మొత్తం విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా డిసెంబర్ 2023 చివరి నాటికి 7.75 శాతం నుండి ఏప్రిల్ 2024 చివరి నాటికి దాదాపు 8.7 శాతానికి పెరిగింది.