మణిపూర్‌ లో రెమాల్‌ తుపాను బీభత్సహం

మణిపూర్‌ లో రెమాల్‌ తుపాను బీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఐదుగురు మరణించారు. మరో 13మంది గాయపడ్డారు. లక్షలాది మందిపై వరదల ప్రభావం పడింది. ఇంఫాల్‌ నగరం నుంచి ప్రవహించే చాలా నదుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. 
 
స్థానిక మీడియా కథనం మేరకు వరద బీభత్సానికి మే 28 నుంచి మే 31 వరకు వరుసగా ఐదుగురు మరణించారు. సహాయ, విపత్తు నిర్వహణ శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో 255 గ్రామాలు, ప్రాంతాల్లో మొత్తం 1,26,950 మంది జలదిగ్బంధమయ్యాయి. 16,364 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న 20,504 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 522 హెక్టార్ల పంట ప్రాంతాలు నష్టపోయాయి. 
 
కొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో గత మూడు రోజుల్లో 292 కొండచరియలు విరిగిపడ్డాయి. బాధితుల కోసం 51 సహాయక శిబిరాలను ప్రారంభించినట్లు అధికారిక నివేదిక తెలిపింది. ఆదివారం నుంచి.. ఇంఫాల్‌ గుండా ప్రవహించే చాలా నదులలో నీటి మట్టాలు వేగంగా పెరిగాయి. రెండు ప్రధాన నదులు ఇప్పటికే ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఇంఫాల్‌ వెస్ట్‌, ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాల్లో నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్‌ఎఫ్‌), ఇంఫాల్‌ వెస్ట్‌ జిల్లాలో వైమానిక దళం, నౌకాదళం, సైన్యాన్ని మోహరించారు. ఇంఫాల్‌ ఈస్ట్‌, ఇంఫాల్‌ వెస్ట్‌, బిష్ణుపూర్‌, జిరిబామ్‌, నోనీ, కాంగ్పోక్పి, తమెంగ్లాంగ్‌, చందేల్‌, చురాచంద్పూర్‌, సేనాపతి, కక్చింగ్‌ సహా పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక సామగ్రిని పంపిణీ చేశారు. 

ఇప్పటివరకు 969 మంది పురుషులు, 992 మంది మహిళలు, 601 మంది పిల్లలతో సహా మొత్తం 2,561 మందిని రక్షించినట్లు రెస్క్యూ మిషన్‌లో మోహరించిన అసోం రైఫిల్స్‌ తెలిపింది. అసోం రైఫిల్స్‌కు చెందిన పదహారు దళాలు.. మే 30న 2,050 మందికి, మే 31న 3 వేల మందికి ప్యాక్‌ చేసిన ఆహారాన్ని పంపిణీ చేశాయి. ఇంఫాల్‌ పట్టణం, చుట్టుపక్కల వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి మట్టాలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే ప్రధాన మార్కెట్‌ ప్రాంతాలు (ఎంజీ అవెన్యూ, తంగల్‌ బజార్‌, పానా) ఇంకా నీటిలోనే ఉండగా, బిష్ణుపూర్‌ జిల్లాలోని నాంబోల్‌.. వరదలకు ప్రభావితమైన జాబితాలో తాజాగా చేరింది. 

శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినీత్‌ జోషితో కలిసి ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ ఇంఫాల్‌ లోని వరద ప్రభావిత పానా బజార్‌ ను సందర్శించారు. సిఎం బీరెన్‌ సింగ్‌ ట్వీట్‌ చేస్తూ  ” రెమాల్‌ తుఫాను తరువాత మణిపూర్‌లో వరద పరిస్థితి గురించి గౌరవనీయ హౌం మంత్రి శ్రీ అమిత్‌ షా నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు” అని చెప్పారు.