ఎన్నికలకు ముందు బ్రిటన్‌ పార్లమెంట్‌ రద్దు

ఎన్నికలకు ముందు బ్రిటన్‌ పార్లమెంట్‌ రద్దు
బ్రిటన్‌లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జులై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు బ్రిటన్‌ పార్లమెంట్‌ రద్దైంది. ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా పార్లమెంట్‌ను గురువారం రద్దు చేశారు.
 
ఇక బ్రిటన్‌ పార్లమెంట్‌లో మొత్తం 650 మంది సభ్యులు ఉన్నారు. పార్లమెంట్‌ రద్దుతో ఐదు వారాల ఎన్నికల ప్రచారం నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది.  గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. 
 
అయితే, ప్రధానిగా సునాక్‌ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి.  ఈ ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈనెల 23న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ వద్ద వర్షంలో తడుస్తూనే సునాక్‌ ఎన్నికల తేదీలపై ప్రకటన చేశారు. 
 
‘బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చింది. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలను సాధించాం. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. దేశాధినేత కింగ్‌ చార్లెస్ IIIతో మాట్లాడాను. పార్లమెంట్‌ను రద్దు చేయమని అభ్యర్థించాను. ఇందుకు రాజు కూడా అనుమతించారు. జూలై 4న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి’ అని రిషి సునాక్‌ వెల్లడించారు.