ఉద్యోగ విరమణ రోజున ఎట్టకేలకు ఐపీఎస్ ఎబివికి పోస్టింగ్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఐదేళ్లుగా దాదాపు సస్పెన్షన్ లో గడిపారు.  కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) నుండి సుప్రీంకోర్టు వరకు సస్పెన్షన్ చెల్లదని స్పష్టం చేసినా  పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారు. అయితే చివరకు మరోసారి క్యాట్ సస్పెన్షన్ చెల్లదని స్పష్టం చేయడం, క్యాట్ ఆర్డర్ విషయంలో జోక్యంపై రాష్ట్ర హైకోర్టు నిరాకరించడంతో ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్న శుక్రవారం రోజున ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేశారు. 
 
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్వీసులోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఎత్తివేసింది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
 
ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే  సాయంత్రంతో ఆయన రిటైర్డ్‌ కాబోతున్నారు. 2019 ఎన్నికల అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటుపడింది. అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి పోస్టింగ్ లేకుండా పోయింది.
బహుశా దేశంలో డైరెక్టర్ జనరల్ హోదా కలిగిన అధికారులు ఎవ్వరూ ఇటువంటి కక్షసాధింపు చర్యలకు గురికావడం, ఐదేళ్లపాటు సస్పెన్షన్ లో ఉండాల్సి రావడం జరిగి ఉండదు.
 
 టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఆయనను సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే లక్ష్యంగా పెట్టుకొని వేధింపులకు గురిచేస్తున్నారు.

2019 మే 30న ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజు అంటే మే 31న ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కోసం తన కుమారుడికి చెందిన సంస్థకు ఏబీ వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్‌ ఇప్పించారన్న ఆరోపణలను సృష్టించారు.

 
 గత ప్రభుత్వంలో కొనుగోలు అంశంపై ఉన్నతాధికారుల అభ్యంతరాలు చెప్పినా వినిపించుకోలేదని అభియోగాలు మోపారు. ప్రధానంగా నిఘా పరికరాల వ్యవహారం, ఇజ్రాయెల్‌కు రహస్యాలు చేరవేశారని కూడా కేసు నమోదు చేసింది. దీంతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు. ఈ విషయమై ఆయన సుదీర్ఘకాలం న్యాయపోరాటం జరిపారు. కాగా, అసలు ఆ నిఘా పరికరాల కొనుగోలు జారగానే లేదు.
 
తొలిసారి క్యాట్‌, కేంద్ర హోంశాఖలో ఆయనకు ఊరట దక్కలేదు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. 2022 జూన్‌ 15న ఆయనకు ఉపశమనం లభించింది. కోర్టు జోక్యంతో ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా ఏబీవీ బాధ్యతలు చేపట్టారు. అయితే 14 రోజుల తర్వాత అదే ఏడాది జూన్‌ 29న మళ్లీ సస్పెండ్‌ చేశారు. 
 
ఆ తర్వాత ఆయన నిరంతర న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్‌ చేస్తూ జారీచేసిన ఉత్తర్వులపై ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించారు. ఒకే కారణంతో రెండు సార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేశారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్‌ ఈ నెల 8న కీలక ఆదేశాలిచ్చింది.  ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ చెల్లదని, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని క్యాట్‌ తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయలేదు.
తీర్పు కాపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి పంపినా ప్రభుత్వం దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీఎం జగన్‌ ఆమోదం కోసం సీఎస్‌ ఫైలు పంపినా ఇటీవల లండన్‌ వెళ్లే ముందు జగన్‌ ఆ ఫైలు చూడటానికి నిరాకరించారని సమాచారం.  ఈ లోగా క్యాట్ ఉత్తరువును రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో సవాల్ చేసినా ప్రయోజనం లేకపోయింది.
 
ఏబీవీ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన హైకోర్టు ప్రభుత్వం ఐదేళ్లుగా ఆయన్ని సస్పెన్షన్‌లోనే ఉంచిన విషయాన్ని గుర్తు చేసింది. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను ఈ దశలో నిలిపిస్తే అది ఏబీ వెంకటేశ్వరరావుకి తీవ్ర నష్టం కలగజేస్తుందని వెకేషన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. సుదీర్ఘమైన సర్వీసు కలిగి ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించి క్యాట్‌ ఉత్తర్వుల్ని అమలు చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలతో ఏబీవీకి పోస్టింగ్‌ ఇచ్చేందుకు వీలుగా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేయాల్సి వచ్చింది.
ఏబీ వెంకటేశ్వరరావు 1989లో సర్వీసులో చేరారు. ఆయన 2015 జులై 6న ఇంటిలిజెన్స్ అదనపు డీజీగా నియమితులయ్యారు. ఏబీవీ 2019 మార్చి 10న డీజీ ర్యాంకుకు ప్రమోషన్ దక్కింది.. అనంతరం ఏబీవీని బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను 2019 ఏప్రిల్‌ 22న ఏసీబీ డీజీగా పోస్టింగ్‌ ఇచ్చారు.