20 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు

20 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉన్న 8,337 మంది అభ్యర్థుల్లో 20 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 14 శాతం మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు సంబంధించిన తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 

మొత్తం 8,360 మంది ఎంపి అభ్యర్థులుండగా వీరిలో 8,337 మంది అఫిడవిట్‌ లను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) విశ్లేషించింది. వీరిలో జాతీయ పార్టీల నుంచి 1,333 మంది, ప్రాంతీయ పార్టీల నుంచి 532 మంది, గుర్తింపు లేని పార్టీల నుంచి 2,580 మంది, స్వతంత్రంగా 3,915 మంది అభ్యర్థులు ఉన్నారు.

క్రిమినల్‌ కేసులున్న అభ్యర్థులు

గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల క్రిమినల్‌ నేపథ్యం గురించి ఈ విశ్లేషణ వెల్లడించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8,337 మంది అభ్యర్థుల్లో 1,643 మంది (20 శాతం) తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 7928 మంది అభ్యర్థుల్లో 1500 మంది (19 శాతం) అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 

2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో విశ్లేషించిన 8,205 మంది అభ్యర్థుల్లో 1,404 మంది (17 శాతం) అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో విశ్లేషించిన 7,810 మంది అభ్యర్థుల్లో 1,158 మంది (15 శాతం) తమపై క్రిమినల్‌ కేసులు తమ అఫిడవిట్లలో ప్రకటించారని ఎటిఆర్‌ తెలిపింది.

తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్న అభ్యర్థులు

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,191 మంది (14 శాతం) అభ్యర్థులపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఎడిఆర్‌ గుర్తించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో విశ్లేషించిన 7,928 మంది అభ్యర్థుల్లో 1,070 మంది (13 శాతం) అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 

2014 సార్వత్రిక ఎన్నికల్లో 8,205 మంది అభ్యర్థుల్లో 908 మంది (11 శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో 7,810 మంది అభ్యర్థుల్లో 608 మంది (8 శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారని ఎడిఆర్‌ విశ్లేషణలో వెల్లడించింది.

పార్టీల వారీగా క్రిమినల్‌ నేపథ్యం

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో బిజెపి నుంచి పోటీ చేసిన 440 మంది అభ్యర్థుల్లో 191 మంది (43 శాతం), కాంగ్రెస్‌ నుంచి 327 మంది అభ్యర్థుల్లో 143 మంది (44 శాతం), బిఎస్పి నుంచి బరిలోకి దిగిన 487 మంది అభ్యర్థుల్లో 63 మంది (13 శాతం), 3,915 స్వతంత్ర అభ్యర్థుల్లో 550 మంది (14 శాతం) తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 

మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను 197 మంది అభ్యర్థులు ప్రకటించారు. వీరిలో 16 మంది అభ్యర్థులు అత్యాచారానికి సంబంధించిన అభియోగాలను (ఐపిసి సెక్షన్‌ -376) ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో 751 రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 677 రాజకీయ పార్టీలు, 2014లో 464 రాజకీయ పార్టీలు, 2009 లోక్‌సభ ఎన్నికల్లో 368 రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. అంటే 2009 నుంచి 2024 మధ్య రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగిందని ఎడిఆర్‌ తెలిపింది.