తెలంగాణ అధికారిక చిహ్నం మార్పులో రేవంత్ వెనకడుగు

తెలంగాణ అధికారిక చిహ్నం మార్పులో రేవంత్ వెనకడుగు

తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు వివాదాస్పదంగా మారడంతో 10వ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా జూన్ 2వ తేదీన చిహ్నంను ఆవిష్కరించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరమించుకున్నారు. చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ ల తొలగింపుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో వెనుకడుగు వేసిన్నట్లు తెలుస్తున్నది.

ఇందుకోసం కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన పలు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వీటిలో దానిని ఖరారు చేసి ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న విడుదల ఆవిష్కరించాలని భావించారు. నూతన చిహ్నంను ఖరారు చేసేందుకు గురువారం సాయంత్రం మేధావులు, వివిధ పార్టీల నాయకులతో ముఖ్యమంత్రి ఓ సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

అయితే అకస్మాత్తుగా, నూతన చిహ్నం ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తమకు 200 వరకు సూచనలు వచ్చాయని, వాటిని పరిశీలించడంతో పాటు మరింతగా సంప్రదింపులు చేయాల్సి ఉందని తెలిపింది. జూన్ 2న నూతన రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
 
కాగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత అప్పటి ప్రభుత్వం కొత్త లోగోను ఆవిష్కరించింది. అందులో కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ కట్టడాలు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం లోగోను మార్చాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అంటే త్యాగాలు అని, రాచరికపు ఆనవాళ్లు లేకుండా లోగో రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు.

తెలంగాణ చారిత్రక చిహ్నాలను కాంగ్రెస్ తొలగిస్తోందని, లోగోలో చార్మినార్‌ను తొలగించడమంటే హైదరాబాద్‌ను అవమానించడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆ మేరకు ఆయన చార్మినార్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వైభవానికి చిహ్నమైన కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా లోగో రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.