ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లోదీపికా పదుకోన్ మేటి

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లోదీపికా పదుకోన్ మేటి
బాలీవుడ్ లో అగ్రశ్రేణి నటులలో ఒకరినే దీపికా పదుకోన్ 2014 నుంచి 2024 ఏప్రిల్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్)లో ఎక్కువ మంది చూసిన భారతీయ నటుల జాబితాలో మొదటి స్థానం సొంతం చేసుకుంది. ఈ జాబితాను బుధవారం ఐఎండీబీ తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. . షారుక్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ బాలీవుడ్ హీరోలను కూడా దీపికా మించేసింది.
 
అంతేకాదు ఈ జాబితా టాప్ 10లో అందరూ బాలీవుడ్ నటులే ఉన్నారు. తాను టాప్ లో నిలవడంపై దీపికా స్పందిస్తూ “ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల సెంటిమెంట్ కు అద్దం పట్టే ఈ లిస్టులో ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఐఎండీబీ క్రెడిబిలిటీ నమ్మదగినది. ప్రేక్షకుల నిజమైన అభిరుచులు, ఆసక్తులు, ప్రాధాన్యతలను సరిగ్గా అర్థం చేసుకుంటుంది. ఈ గుర్తింపు నాకు చాలా ప్రత్యేకమైనది”అని సంతోషం వ్యక్తం చేశారు.
 
ఐఎండీబీ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ టాప్ 100 లిస్టులో బాలీవుడ్ తోపాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల నటులు కూడా ఉన్నారు. టాప్ 10 విషయానికి వస్తే దీపిక తర్వాత షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. ఇందులో దక్షిణాది నుంచి ఒక్కరు కూడా లేరు.

దీపికా పదుకోన్ 2007లో వచ్చిన ఓం శాంతి ఓం మూవీతో తెరంగేట్రం చేశారు. అప్పటి నుంచి క్రమంగా బాలీవుడ్ లోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదుగుతూ వస్తోంది. 2017లో ట్రిపుల్ ఎక్స్ మూవీతో హాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఈ మూవీలో విన్ డీజిల్ సరసన్ ఆమె నటించింది.

ఇక ఇప్పుడు తెలుగులోనూ నటించింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి  చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రణ్‌వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న దీపిక  ఈ ఏడాది సెప్టెంబర్ లో తన తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. జూన్ 27న కల్కి 2898 ఏడీ చిత్రం విడుదల అవుతోంది. ఆ తర్వాత సింగం అగైన్ మూవీలోనూ దీపికా నటించింది. ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న ఆమె వచ్చే ఏడాది మళ్లీ షూటింగ్ లు మొదలు పెట్టనుంది.