మెక్సికోలో ఇజ్రాయెల్ ఎంబసికి నిప్పు

మెక్సికోలో ఇజ్రాయెల్ ఎంబసికి నిప్పు
పాలస్తీనాలోని రఫాలో ఇజ్రాయెల్‌ మారణకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెక్సికోలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి నిప్పుపెట్టారు. బీరు క్యాన్లు చల్లి మంటలు రాజేశారు. నిరసకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. 
 
‘రఫా కోసం అత్యవసర చర్య’ పేరుతో ప్రదర్శన చేపట్టారు. సుమారు 200 మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌ ఆర్మీ బాంబులు కురిపించి శిబిరాల్లో తల దాచుకున్న ప్రజలను చంపడంపై మండిపడ్డారు. గాజాలో మారణకాండను ఇజ్రాయెల్‌ నిలిపివేయాలని నినాదాలు చేశారు.  కాగా, దక్షిణ గాజాలో నిరాశ్రయులైన ప్రజల శిబిరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. రెండు బాంబు దాడుల్లో సుమారు 45 మంది ప్రజలు మరణించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. 200 మందికిపైగా గాయపడినట్లు చెప్పారు.

మరోవైపు ర‌ఫా క్యాంపుపై ఇజ్రాయెల్‌ దాడుల్లో భారీగా మంట‌లు వ్యాపించాయి. చిన్నారులు, మ‌హిళ‌ల‌కు చెందిన కాలిన మృతదేహాలు చెల్లాచెదురుగా ప‌డి ఉన్నాయి. ర‌ఫాలోని శిబిరాల్లో సుమారు 13 లక్షల మంది పాల‌స్తీనియ‌న్లు ఆశ్రయం పొందుతున్నారు.

ఇలాఉండగా, ర‌ఫాలోని సెటిల్మెంట్ క్యాంపుపై ఆదివారం ఇజ్రాయిల్ జరిపిన దాడి కోసం అమెరికా త‌యారు చేసిన బాంబుల‌ను వాడిన‌ట్లు తెలుస్తోంది. పేలుడు ప‌దార్ధాల నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ విష‌యాన్ని అంచ‌నా వేశారు. మృతిచెందిన‌వారిలో ఎక్కువ శాతం మ‌హిళ‌లు, చిన్నారులు ఉన్నారు. ర‌ఫాలో సుమారు 13 ల‌క్ష‌ల మంది పాల‌స్తీనియ‌న్లు ఆశ్ర‌యం పొందుతున్నారు.

మంగ‌ళ‌వారం కూడా ఇజ్రాయిల్ ద‌ళాల‌కు చెందిన యుద్ధ ట్యాంకులు ర‌ఫా న‌గ‌రంలోకి ప్ర‌వేశించాయి. హ‌మాస్‌పై యుద్ధం ప్ర‌క‌టించి ఏడు నెల‌ల గ‌డిచిన త‌ర్వాత తొలిసారి ఇజ్రాయిల్ ట్యాంకులు ర‌ఫాలోకి వెళ్లాయి. దీంతో ఇజ్రాయిల్ చేప‌డుతున్న యుద్ధం కొత్త ద‌శ‌కు చేరుకున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  ర‌ఫాపై దాడి జ‌రిగిన అంశంలో మాత్రం అమెరికా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోలేదు. ఇజ్రాయిల్ ఆ దాడి విష‌యంలో రెడ్‌లైన్ దాట‌లేద‌ని అమెరికా పేర్కొన్న‌ది. బోయింగ్ సంస్థ త‌యారు చేస్తున్న జీబీయూ-39 బాంబుల‌ను ర‌ఫాపై అటాక్ కోసం ఇజ్రాయిల్ వాడినట్లు తెలుస్తోంది.