అందరి దృష్టి పాకిస్థాన్‌లోని హిందువులపైనే!

అందరి దృష్టి పాకిస్థాన్‌లోని హిందువులపైనే!
గాజాలోని రఫాలో ఇజ్రాయెల్‌ దాడులపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు ‘అందరి దృష్టి రఫా వైపే’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు పాలస్తీనాకు మద్దతు తెలిపుతూ మారణకాండను ఖండించారు. 
 
ఇదిలా ఉండగా.. భారత క్రికెటర్‌ రాహుల్‌ తెవాటియా చేసిన పోస్టల్‌ వైరల్‌గా మారింది. అందరూ గాజాలో ఇజ్రాయెల్‌ దాడులపై నిరసన గళమెత్తగా.. ఈ క్రికెటర్‌ పాక్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను లేవనెత్తాడు.  ‘అందరి దృష్టి పాకిస్థాన్‌లోని హిందువులపై ఉంది’ అంటూ తన ఇస్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు. 
 
‘All Eyes on Hindus in Pakistan’ అంటూ పెట్టిన‌ స్టోరీ వైరల్‌ అవుతుండగా త‌మ‌దైన శైలిలో నెటిజ‌న్స్‌ స్పందిస్తున్నారు. క్రికెటర్‌ పోస్టుపై నెటిజన్స్‌ పలువురు సానుకూలంగా స్పందించారు. దాయాది దేశంలో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను ధైర్యంగా లేవనెత్తడంపై పలువురు ప్రశంసించారు. భారత్‌లోని ప్రముఖులంతా యంగ్‌ క్రికెటర్‌ను చూసి నేర్చుకోవాలని హితవులు పలుకుతున్నారు. 
 
ఇదిలా ఉండగా రఫాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడింది. ఈ  ఘటనలో పిల్లలు, మహిళలు సహా 45 మంది సాధారణ పౌరులు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై యావత్‌ ప్రపంచదేశాలు ఖండించాయి. ఈ క్రమంలోనే భారత్‌కు సంబంధించిన ప్రముఖులు సైతం పాలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తూ ‘అందరి దృష్టి రఫాపైనే ఉంది’ అంటూ పోస్టులు చేస్తున్నారు. 
 
టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితికా పోస్ట్‌ చేయగా ఆమెను విపరీతంగా ట్రోల్‌ చేశారు. దాంతో ఆమె పోస్ట్‌ను డిలీట్‌ చేశారు. అలాగే హీరోయిన్లు త్రిష, సమంత, మాళవికా మోహనన్, రష్మిక, దుల్కర్ సల్మాన్, పార్వతి తిరువొతు, అమీ జాక్సన్, అలియా భట్, కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, దియా మీర్జా, త్రిప్తి డిమ్రి సైతం సంఘీభావం ప్రకటించిన వారిలో ఉన్నారు.