ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్

ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్
గోషామహల్ బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు పలు నెంబర్ల నుంచి ఫోన్ చేసి చంపుతామని బెదిరించినట్టు రాజాసింగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇలాంటి బెదిరింపులకు గురికావడం ఇదే తొలిసారి కాదని, గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని విచారం వ్యక్తం చేశారు. 
 
అయినప్పటికీ బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ పరిస్థితిని పోలీసులకు తెలియపరుస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డిజిపి రవిగుప్తాలకు ఆయన లేఖలు రాశారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నెంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

 
గతంలోనూ రాజాసింగ్‌ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. పాకిస్థాన్ నుంచి ఆ కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు వచ్చిన కాల్స్‌పై అప్పటి డీజీపీ అంజన్‌కుమార్ యాదవ్‌కు ఫిర్యాదు కూడా చేశారు.

‘మరోసారి, ఈరోజు నాకు అనేక నెంబర్ల నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. నేను ఇలాంటి బెదిరింపులకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అయినప్పటికీ, బాధ్యతాయుతమైన పౌరుడిగా, నేను పోలీసులకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నాను’ అని రాజా సింగ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

అంతకుముందు తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తుందని కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు మార్లు వాహనం మొరాయించడంతో మార్గమధ్యలోనే వాహనం దిగి నడుచుకుంటూ రావాల్సి వస్తోందన్నారు. కొత్త వాహనం కేటాయించాలని కోరారు.