కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపుకు చుక్కెదురు

కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపుకు చుక్కెదురు
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు భారీ షాక్‌ తగిలింది. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో కేజ్రీ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. 
 
ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని బుధవారం స్పష్టం చేసింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌ ఇదివరకే అవకాశం ఇచ్చినందున ఈ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని కోర్టు రిజిస్ట్రీ తెలిపింది.  అంతకుముందు కేజ్రీ చేసిన అభ్యర్థనను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. 
 
పిటిషన్‌ను ఎప్పుడు విచారించాలన్న అంశంపై సీజేఐ చంద్రచూడ్‌ నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్ట్‌ వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం వెల్లడించింది. ఈ పిటిషన్‌ను మధ్యంతర బెయిల్‌ను విచారిస్తున్న బెంచ్‌ ఉన్నప్పుడు గతవారమే ఎందుకు దాఖలు చేయలేదని కోర్టు ప్రశ్నించింది.కాగా, లిక్కర్‌ పాలసీ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. 

దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్‌ మంజూరు చేసింది. ఇక జూన్‌ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. అయితే, తీవ్రమైన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.